ఉక్రెయిన్ విద్యార్థులకు శుభవార్త

September 07, 2022
img

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభించినప్పుడు అక్కడ వైద్య విద్యను అభ్యసిస్తున్న సుమారు 20,000 మంది విద్యార్థులు ప్రత్యేక విమానాలలో భారత్‌ తిరిగివచ్చారు. నేటికీ ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్నందున వారు మళ్ళీ అక్కడకు వెళ్ళి వైద్య విద్య అభ్యసించే అవకాశం లేదు. నిబందనల కారణంగా వారు భారత్‌ లేదా విదేశీ మెడికల్ కాలేజీలలో చదువులు కొనసాగించలేని పరిస్థితి. దీంతో ఆ వైద్య విద్యార్థుల భవిష్యత్‌ అయోమయంగా మారింది. 

వారి సమస్యను గుర్తించిన భారత్‌ జాతీయ మెడికల్ కౌన్సిల్ ఓ కీలక నిర్ణయం తీసుకొంది. వారు భారత్‌తో సహా ఇతర దేశాల మెడికల్ కాలేజీలలో చేరి తమ చదువులు పూర్తిచేసుకొనేందుకు అనుమతించింది. ఉక్రెయిన్‌ ప్రభుత్వం కూడా ఈ బదిలీలకు అనుమతించింది. అయితే వారు ఎక్కడ వైద్య విద్య పూర్తిచేసినా వారు ఉక్రెయిన్‌లో ఏ మెడికల్ కాలేజీలో మొదట చదువుకొన్నారో అదే కాలేజీ వారికి ఫైనల్ సర్టిఫికేట్ జారీ చేస్తుందని భారత్‌ జాతీయ మెడికల్ కౌన్సిల్ తెలియజేసింది.   

ఉక్రెయిన్‌ వైద్య విద్యార్ధులు భారత్‌ తిరిగి రాగానే వారు భారత్‌లో తమ చదువులు కొనసాగించేందుకు అనుమతించాలని తెలంగాణ సిఎం కేసీఆర్‌ కేంద్ర ప్రభుత్వానికి ఓ లేఖ వ్రాశారు. కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే ఉక్రెయిన్‌ నుంచి తిరిగివచ్చిన తెలంగాణకు చెందిన వైద్య విద్యార్దులందరికీ రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలలో ఉచితంగా అడ్మిషన్లు ఇచ్చి అవసరమైతే అందరి ఫీజులు భరిస్తామని కేసీఆర్‌ ఆ లేఖలో పేర్కొన్నారు. ఇప్పుడు అనుమతి లభించింది కనుక తెలంగాణలో వైద్య విద్యార్థులకు ఇది గొప్ప శుభవార్తే! 

Related Post