బాసర ట్రిపుల్ ఐ‌టి విద్యార్ధికి రూ.64 లక్షల జీతం

July 28, 2022
img

నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐ‌టి (ఆర్‌జీయుకేటి)లో కంప్యూటర్ సైన్స్‌లో ఇంజనీరింగ్ డిగ్రీ చేసిన తంగెళ్ళపల్లి నిఖిల్‌ అమెజాన్ కంపెనీలో ఏడాదికి రూ.64 లక్షల జీతంతో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం సాధించాడు. నిఖిల్ వయసు కేవలం 21 ఏళ్ళు మాత్రమే. ఇంత చిన్న వయసులోనే తొలిప్రయత్నంలోనే అంత పెద్ద జీతంతో అమెజాన్ వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలో ఉద్యోగం సాధించడంతో అతని తల్లితండ్రులు చాలా సంతోషిస్తున్నారు. బాసర ట్రిపుల్ ఐ‌టి అధ్యాపకులు, అతని తోటి విద్యార్థులు అభినందనలు తెలుపుతున్నారు. 

టేకులపల్లి మండలంలోని ముత్యాలంపాడు గ్రామంలో సామాన్య మద్యతరగతికి చెందిన ఈశ్వరాచారి, అనితా లక్ష్మి దంపతుల పెద్ద కుమారుడే నిఖిల్. 2015-16లో పదోతరగతిలో 10 జీపీఏ సాధించడంతో బాసర ట్రిపుల్ ఐ‌టిలో సీటు లభించింది. అక్కడే ఇంటర్మీడియెట్‌తో పాటు బీటెక్‌ కంప్యూటర్ సైన్స్ డిగ్రీ కూడా చేశాడు. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతుడగా క్యాంపస్ సెలక్షన్‌లో అమెజాన్ కంపెనీలో ఏడాదికి రూ.64 లక్షల జీతంతో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం సాధించాడు. అదీ... స్పెయిన్ రాజధాని మాడ్రిట్‌లో ఉన్న అమెజాన్ కంపెనీలో చేరబోతున్నాడు. మరో రెండు నెలల్లో అక్కడ ఉద్యోగంలో చేరేందుకు వెళతానని నిఖిల్ చెప్పాడు. 

బాసర ట్రిపుల్ ఐ‌టిలో చదువుకొనే విద్యార్థులందరికీ ఇటువంటి గొప్ప అవకాశాలు రావచ్చు కనుక ఏదో మొక్కుబడిగా కాకుండా శ్రద్దగా చదువుకొంటే మంచిది.  

Related Post