బాసర ట్రిపుల్ ఐటిలో జోరుగా సాగుతున్న పనులు

June 28, 2022
img

బాసర ట్రిపుల్ ఐటిలో లైట్లు, ఫ్యానులు, త్రాగునీరు, టాయిలెట్స్ వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలంటూ విద్యార్దుల ఆందోళనతో దిగివచ్చిన ప్రభుత్వం పనులు ప్రారంభించింది. నిర్మల్ జిలా కలెక్టర్‌ ముషారఫ్ అలీ ఫారూఖీ స్వయంగా ప్రతీరోజూ ట్రిపుల్ ఐటికి వచ్చి పనులను పర్యవేక్షిస్తున్నారు. వాటితో పాటు లైబ్రెరీ, ల్యాబ్‌లో అవసరమైన సదుపాయాలు కల్పిస్తున్నారు. 

విద్యార్దుల డిమాండ్ మేరకు ల్యాప్‌టాప్‌లు అందజేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. మొత్తం 1,600 ల్యాప్‌టాప్‌లు కొనుగోలుచేయబోతోంది. కనుక నెలరోజులలోగా అర్హులైన విద్యార్దులందరికీ ల్యాప్‌టాప్‌లు అందే అవకాశం ఉంది. ఇక ఈ నెలాఖరులోగా 110 మంది అధ్యాపకులను నియమించబోతున్నట్లు సమాచారం. కానీ వైస్ ఛాన్సిలర్ నియామకానికి సుమారు మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.       

అయితే ట్రిపుల్ ఐటిలో మౌలిక వసతుల కల్పన, ఇతర పనులకు ప్రభుత్వం రూ.5 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చింది కానీ ఇంతవరకు విడుదల చేయకపోవడంపై విద్యార్దులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అరకొరపనులు చేసి చేతులు దులుపుకొని వెళ్ళిపోతే మళ్ళీ ఆందోళన చేయక తప్పదని హెచ్చరిస్తున్నారు.

Related Post