గ్రూప్-4లో 9,618 ఉద్యోగాలకు ఒకటే నోటిఫికేషన్‌?

June 24, 2022
img

తెలంగాణ ప్రభుత్వం వివిద శాఖలలో ఉద్యోగాల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో ఇప్పటికే కొన్ని నోటిఫికేషన్లు వెలువడ్డాయి. వాటికి అభ్యర్ధుల నుంచి భారీగా స్పందన వచ్చింది. ప్రభుత్వోద్యోగాలలో సాధారణ విద్యార్హతలతో వచ్చే ఉద్యోగాలు ఎక్కువగా గ్రూప్-4లో ఉంటాయి. దీనిలో మొత్తం 9,618 పోస్టులు భర్తీ చేయబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అయితే వాటన్నిటికీ వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేసినట్లయితే ఈ ప్రక్రియ చాలా ఆలస్యమవుతుంది కనుక మొత్తం 9,618 పోస్టులకు ఒకే నోటిఫికేషన్‌ జారీ చేయాలని అధికారులు భావిస్తున్నారు. 

ఇదే అంశంపై చర్చించేందుకు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్‌ టిఎస్‌పీఎస్సీ, వివిదశాఖల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలు, సూచనలు తెలుసుకొన్నారు. అన్ని పోస్టులకు ఒకే నోటిఫికేషన్‌ జారీ చేయడమే మంచిదని వారు అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కనుక ఈ పోస్టులకు సంబందించిన ఫైలును ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆమోదం కోసం పంపించారు. 

ముఖ్యమంత్రి ఆమోదం తెలపగానే, గ్రూప్-4లో 9,618 ఉద్యోగాలకు ఒకటే నోటిఫికేషన్‌ జారీ చేయాలని టిఎస్‌పీఎస్సీ భావిస్తోంది. బహుశః ఒకటి రెండు రోజులలో నిర్ణయం తీసుకొన్నట్లయితే జూలై రెండోవారంలోగా గ్రూప్-4 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉంది.

Related Post