ఆందోళన విరమించిన బాసర ట్రిపుల్ ఐ‌టి విద్యార్దులు

June 21, 2022
img

గత వారం రోజులుగా ఎండా వాన లెక్క చేయకుండా ఆందోళన చేస్తున్న బాసర ట్రిపుల్ ఐ‌టి విద్యార్దులు సోమవారం అర్దరాత్రి ఆందోళన విరమిస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నిన్న రాత్రి 9.30 గంటలకు వచ్చి వారితో అర్దరాత్రి వరకు చర్చలు జరిపి, వారి డిమాండ్స్ అన్ని పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్దులు ఆందోళన విరమించి నేటి నుంచి తరగతులకు హాజరవబోతున్నట్లు ప్రకటించారు. 

ఆమెతో పాటు నిర్మల్ జిల్లా కలెక్టర్‌ ముషారఫ్ ఆలీ ఫారూఖీ, వైస్ ఛాన్సిలర్ రాహుల్ బొజ్జా, ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ వెంకటరమణ, విద్యాశాఖ కమీషనర్‌ వాకాటి కరుణ, కొత్తగా డైరెక్టర్‌గా నియమితులైన సతీష్ కుమార్, ఎస్పీ ప్రవీణ్ కుమార్‌, స్థానిక ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ఈ చర్చలలో పాల్గొన్నారు. 

మంత్రి సబితా ఇంద్రారెడ్డి వచ్చిన తరువాత 20 మందితో కూడిన విద్యార్దుల గవర్నింగ్ కౌన్సిల్‌తో ఆడిటోరియంలో అర్ధరాత్రి వరకు చర్చలు జరిపారు. విద్యార్దులు డిమాండ్స్ అన్ని ప్రాధాన్యతా క్రమంలో నెల రోజులలోపుగా  పూర్తిచేస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి వారికి హామీ ఇచ్చారు. అయితే లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని విద్యార్దులు పట్టుబట్టడంతో ఆమె వారికి నచ్చజెప్పారు. దాంతో వారు మంత్రి హామీపై నమ్మకం ఉంచి ఆందోళన విరమిస్తున్నామని ప్రకటించారు. 

ట్రిపుల్ ఐ‌టిలో విద్యార్దులు పేర్కొన్న మౌలిక సదుపాయాల కల్పనకు జిల్లా కలెక్టర్‌ ఫారూఖీ రూ.5.6 కోట్లు విడుదల చేస్తారని మంత్రి సబితా ప్రకటించారు. వారం రోజులుగా సాగుతున్న వారి ఆందోళనలు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ఎట్టకేలకు ప్రశాంతంగా ముగియడంతో జిల్లా అధికారులు కూడా ఊపిరి పీల్చుకొన్నారు. నేటి నుంచి విద్యార్దులు తరగతులకు హాజరుకానున్నారు.

Related Post