మహిళా యూనివర్సిటీగా కోఠి ఉమెన్స్ కాలేజి

January 19, 2022
img

హైదరాబాద్‌ నడిబొడ్డున గల కోఠి ఉమెన్స్ కాలేజీ స్థాపించి త్వరలో 100 ఏళ్ళు పూర్తి కాబోతోంది. ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా కొనసాగుతున్న ఈ కాలేజీలో 4,159 విద్యార్ధినులు చదువుకొంటున్నారు. కోఠి ఉమెన్స్ కాలేజీ యూజీసీ స్వయంప్రతిపత్తి, న్యాక్ గుర్తింపు కలిగి రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన కాలేజీలలో ఒకటిగా నిలుస్తోంది. ఈ నేపధ్యంలో దీనిని పూర్తిస్థాయి మహిళా యూనివర్సిటీగా మార్పు చేయాలని సిఎం కేసీఆర్‌ ఆదేశించారు. 

సిఎం ఆదేశం మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం ఉన్నతాధికారులతో సమావేశమై కోఠి ఉమెన్స్ కాలేజీని మహిళా యూనివర్సిటీగా మార్చడానికి కాలేజీలో కల్పించాల్సిన మౌలికవసతులు, అదనపు భవనాలు, హాస్టల్స్, భోదనా, భోదనేతర సిబ్బంది నియమకాలు తదితర అంశాలపై చర్చించారు. వీలైనంత త్వరగా సమగ్ర నివేదిక తయారుచేయాలని మంత్రి సబితా అధికారులను ఆదేశించారు. 

ఈ సమావేశంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, వైస్ ఛైర్మన్ వెంకట రమణ, సాంకేతిక విద్యాశాఖ కమీషనర్‌ నవీన్ మిట్టల్, ఉస్మానియా రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, కోఠి ఉమెన్స్ కాలేజీ ప్రిన్సిపల్ విజులత తదితరులు పాల్గొన్నారు. ఈ ఏడాది జూన్‌లోగా ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. కోఠి ఉమెన్స్ కాలేజీని యూనివర్సిటీగా మార్చితే రాష్ట్రంలో ఇదే తొలి మహిళా యూనివర్సిటీగా నిలుస్తుంది.


Related Post