బీఆర్‌కె భవన్‌ ఎదుట ఉపాధ్యాయులు మెరుపు ధర్నా

January 17, 2022
img

కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారం రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులను జిల్లాలవారీగా సర్దుబాటు, బదిలీల ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలతో విసిగివేసారిపోయిన ఉపాధ్యాయులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈరోజు ఉదయం తాత్కాలిక సచివాలయం బీఆర్‌కె భవన్‌ ఎదుట మెరుపు ధర్నాకు దిగారు. కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారం తాము ఎంపిక చేసుకొన్న జిల్లాలకు కాకుండా వేరే జిల్లాలకు బదిలీ చేశారని, జీవితభాగస్వాములకు వేర్వేరు జిల్లాలలో పోస్టింగ్ ఇచ్చారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే సీనియారిటీ జాబితాలో కూడా అనేక తప్పులు దొర్లాయని వాటిని సవరించి తమకు న్యాయం చేయాలాని కోరుతూ పైఅధికారుల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ తమను పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జీవో నెంబర్ 317ను కూడా సవరించాలని తాము కోరుతున్నామని అన్నారు. ఇకనైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఒక్క సంగారెడ్డి జిల్లా నుంచే 40 మంది ప్రధానోపాధ్యాయులు వేరే జిల్లాలకు బదిలీ అయ్యారని తెలిపారు. 

ఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రగతి భవన్‌లో మంత్రివర్గ సమావేశం జరుగుతున్నందున, ఉపాధ్యాయులు అక్కడికి చేరకుండా భారీగా పోలీసులను మోహరించారు. 

Related Post