తెలంగాణలో కొత్తగా 1,588 కరోనా కేసులు

January 07, 2022
img

తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. బుదవారం 1520 కొత్త కేసులు నమోదు కాగా గురువారం 1,588 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులన్నీ రాజధాని హైదరాబాద్‌ పరిధిలోనే నమోదయ్యాయి. మేడ్చల్ జిల్లాలో 161, రంగారెడ్డిలో 213, జీహెచ్‌ఎంసీ పరిధిలో 1,241 కొత్త కేసులు నిన్న నమోదయ్యాయి.

అయితే ఇప్పటికే చాలామంది కరోనా టీకాలు వేసుకొన్నందున స్వల్పంగా జ్వరం, జలుబు, దగ్గు మాత్రమే వస్తున్నాయి. గతంలోలాగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోవడం వంటి ప్రమాదకరమైన సమస్యలు చాలా తక్కువగా ఉన్నాయి. కనుక ఆసుపత్రిలో చేరనవసరం లేకుండా ఇంట్లోనే కరోనా జాగ్రత్తలన్నీ పాటిస్తూ వైద్యుల సూచన మేరకు మందులు వాడాలని రాష్ట్ర ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ రావు ప్రజలకు సూచించారు. రాబోయే నాలుగు వారాలలో కరోనా కేసులు గణనీయంగా పెరుగవచ్చని కనుక ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, అవసరమైతే తప్ప ఇళ్ళలో నుంచి బయటకు రావద్దని సూచించారు.    

రాష్ట్రంలో కరోనా, ఒమిక్రాన్‌ కేసులు నానాటికీ పెరుగుతున్నందున మళ్ళీ గాంధీ, ఫీవర్, కింగ్ కోఠి, నీలోఫర్, చెస్ట్ హాస్పిటల్స్‌లో పనిచేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బందికి అత్యవసరమైతే తప్ప సాధారణ సెలవులు మంజూరు చేయవద్దని ఆయా హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

   

Related Post