తెలంగాణలో కొత్తగా మరో 4 వైద్య కళాశాలలు

September 14, 2021
img

తెలంగాణలో కొత్తగా మరో 4 వైద్య కళాశాలలు ఏర్పాటు చేయడానికి సిఎం కేసీఆర్‌ ఆమోదం తెలిపారు. వీటిని వికారాబాద్, రాజన్న సిరిసిల్లా, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి జిల్లాలలో ఏర్పాటు చేయబోతున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. 2023లోగా వీటి నిర్మాణ పనులు పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావాలని సిఎం కేసీఆర్‌ ఆదేశించినట్లు అధికారులు తెలిపారు. 

రాష్ట్రంలో ఇప్పటికే సంగారెడ్డి, జగిత్యాల, వనపర్తి, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, నాగర్‌కర్నూల్ జిల్లాలలో కొత్తగా ఏడు వైద్యకళాశాలలు ఏర్పాటవుతున్నాయి. ఇప్పుడు మరో నాలుగు ఏర్పాటైతే మొత్తం 11 వైద్యకళాశాలలు అందుబాటులోకి వస్తాయి. అప్పుడు ఏ జిల్లాకు ఆ జిల్లాలోనే రోగులకు అన్ని రకాల వైద్య సేవలు లభించడమే కాకుండా వీటి ద్వారా వైద్య విద్యార్దులకు కొత్తగా 1,650 మెడికల్ సీట్లు అందుబాటులోకి వస్తాయి కూడా. రాష్ట్రంలో ఇప్పటికే ఉన్నవి, కొత్తగా ఏర్పాటవుతున్నవి కలిపి మొత్తం 20 వైద్యకళాశాలలవుతాయి. అప్పుడు వైద్య సేవల రంగంలో కూడా తెలంగాణ రాష్ట్రం దేశంలో అగ్రస్థానంలో నిలుస్తుంది.

Related Post