ఉద్యోగాల నోటిఫికేషన్లపై త్వరలో నిర్ణయం?

September 07, 2021
img

సుమారు ఏడు నెలల క్రితం రాష్ట్రంలో వివిద ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న 50,000 ఉద్యోగాలను భర్తీ చేస్తామని సిఎం కేసీఆర్‌ ప్రకటించారు. అప్పటి నుంచి రాష్ట్రంలో నిరుద్యోగులు నోటిఫికేషన్ల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ ఉద్యోగ పరీక్షల కోసం హైదరాబాద్‌ వచ్చి హాస్టల్స్‌లో ఉంటూ కోచింగ్‌ తీసుకొంటున్నవారు కూడా ఉన్నారు. కానీ నోటిఫికేషన్లు వెలువడకపోవడంతో నిరుద్యోగ యువత తీవ్ర నిరాశానిస్పృహలలో భారంగా కాలం గడుపుతున్నారు. ముఖ్యంగా వయోపరిమితి దగ్గర పడుతున్న నిరుద్యోగులు చాలా ఆందోళనతో నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. 

తాజా సమాచారం ప్రకారం, రాష్ట్ర ఆర్ధికశాఖ అధికారులు శాఖలవారీగా ఉన్న సుమారు 65 వేలకు పైగా ఖాళీలకు సంబందించి పూర్తి వివరాలు సిద్దం చేసింది. సిఎం కేసీఆర్‌ ఢిల్లీ నుంచి తిరిగి రాగానే వాటిపై చర్చించి తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది. 

ఈనెల 15వ తేదీలోగా శాసనసభ సమావేశాలు కూడా నిర్వహించాల్సి ఉంది కనుక దాని కంటే ముందు మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. కనుక దాని కంటే ముందుగా ఈ ఉద్యోగాల భర్తీపై సిఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. అంటే శాసనసభ సమావేశాలు మొదలయ్యేలోగానే ఈ ఉద్యోగాల భర్తీపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని భావించవచ్చు. హుజూరాబాద్‌ ఉపఎన్నిక ఆలస్యం అవుతోంది కనుక ఉద్యోగాల నోటిఫికేషన్లపై నిర్ణయం కూడా మరికొన్ని రోజులు వాయిదా వేసినా ఆశ్చర్యం లేదు. బహుశః నేడో రేపో సిఎం కేసీఆర్‌ ఢిల్లీ నుంచి తిరిగివస్తే దీనిపై స్పష్టత రావచ్చు. 

Related Post