ఇక ఉద్యోగం వచ్చే వరకు ఒకే టెట్ సర్టిఫికేట్

June 04, 2021
img

ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నవారికి ఓ శుభవార్త. ఇక నుంచి ఒకసారి టెట్ (ఉపాధ్యాయ అర్హత పరీక్ష) పాస్ అయితే ఆ సర్టిఫికేట్‌ను ఉద్యోగం వచ్చేవరకు వినియోగించుకోవచ్చు. గతంలో టెట్ సర్టిఫికేట్‌కు ఏడేళ్ళ పరిమితి ఉండేది. కేంద్రప్రభుత్వం దానిని జీవితకాలానికి వర్తింపజేస్తూ సవరణలు చేసింది. ఇప్పటికే టెట్ పాసైన అభ్యర్ధులకు కూడా దీనిని వర్తింపజేస్తున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ మేరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు,  కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు కూడా సవరణలు చేసుకొని దీనిని అమలుచేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.   

ఉపాధ్యాయ ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్న నిరుద్యోగులకు ఇది చాలా ఊరటనిస్తుంది. ఇదివరకు టెట్ పరీక్షలో ఉత్తీర్ణులైనవారు ఏడేళ్ళలోగా ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించలేకపోతే మళ్ళీ టెట్ పరీక్ష వ్రాయవలసివచ్చేది. ఏడేళ్ళుగా ఉద్యోగ ప్రయత్నాలు ఫలించక తీవ్ర నిరాశానిస్పృహలతో ఉండే నిరుద్యోగులు మళ్ళీ టెట్ పరీక్ష వ్రాసి దానిలో ఉత్తీర్ణులవ్వాలనే నిబందన వారిలో తీవ్ర మానసిక ఆందోళనకు గురి చేసేది. ఇప్పుడు ఒక్కసారి టెట్ పరీక్షలో ఉత్తీర్ణులైతే ఇక మళ్ళీ మళ్ళీ పరీక్ష వ్రాయాల్సిన బాధ ఉండదు.    


Related Post