ఏప్రిల్ 27 నుంచి విద్యాసంస్థలకు వేసవి శలవులు

April 26, 2021
img

తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలలు, జూనియర్ కాలేజీలకు ప్రభుత్వం వేసవి శలవులు ప్రకటించింది. ఈనెల 26వ తేదీ చివరి పనిదినం. ఏప్రిల్ 27 నుంచి మే 31వరకు వేసవి శలవులుగా ప్రకటించింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశం మేరకు ఇంటర్ బోర్డ్ కార్యదర్శి, పాఠశాల విద్య ఇన్‌ఛార్జ్ డైరెక్టర్‌ వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేశారు. 

వాస్తవానికి కరోనా కారణంగా గత ఏడాది సెప్టెంబర్ నుంచి రాష్ట్రంలో అన్ని పాఠశాలలు మూతపడటంతో  ఆన్‌లైన్‌లో పాఠాలు బోధిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కరోనా తీవ్రత తగ్గడంతో 6 నుంచి 10 వరకు పాఠశాలలు తెరిచి ప్రత్యక్ష పద్దతిలో బోధన ప్రారంభించారు. కానీ నెలరోజులకే రాష్ట్రంలో మళ్ళీ కరోనా తీవ్రత పెరగడంతో మార్చి 24 నుంచి పాటశాలలు మూసివేశారు. కనుక ప్రభుత్వం వేసవి శలవులు ఇప్పుడు ప్రకటించినప్పటికీ పాఠశాలలు మూతపడి చాలా రోజులే అయ్యింది. 

కరోనా కారణంగా ప్రభుత్వం పదో తరగతి, ఇంటర్ ప్రధమ పరీక్షలు రద్దు చేసి విద్యార్దులను పైతరగతులకు ప్రమోట్ చేసింది. అలాగే ఒకటి నుంచి 9వ తరగతి వరకు విద్యార్దులకు కూడా పరీక్షలు నిర్వహించకుండానే పైతరగతులకు ప్రమోట్ చేసింది. ఇంటర్ ద్వితీయ విద్యార్దులకు మాత్రం పరీక్షలను వాయిదా వేసింది. జూన్‌ 1వ తేదీన రాష్ట్రంలో కరోనా పరిస్థితిని సమీక్షించిన తరువాత పాఠశాలలు తెరవడంపై నిర్ణయం తీసుకొంటామని విద్యాశాఖ అధికారులు చెప్పారు. 

Related Post