ప్రైవేట్ స్కూల్ టీచర్లకు శుభవార్త!

April 08, 2021
img

ఎట్టకేలకు రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయుల గోడు సిఎం కేసీఆర్‌ చెవికి చేరింది. గుర్తింపు పొందిన పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకి, సిబ్బందికి నెలకు రూ.2,000 ఆర్ధికసాయం, ఉచితంగా 25 కేజీల బియ్యం అందించనున్నట్లు సిఎం కేసీఆర్‌ తెలిపారు. 

గత ఏడాది మార్చిలో ప్రైవేట్ పాఠశాలలు, ప్రైవేట్ కాలేజీలు మూతపడిన తరువాత దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కూడా విధించడంతో వారి పరిస్థితి చాలా దారుణంగా మారింది. లాక్‌డౌన్‌ సమయంలో అయినకాడికి అప్పులు చేస్తూ, ఉన్న కొద్దిపాటి బంగారం అమ్ముకొని అతికష్టం మీద ప్రాణాలు కాపాడుకొన్నారు. లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించినా కరోనా కారణంగా ప్రైవేట్ పాఠశాలలు, ప్రైవేట్ కాలేజీలు తెరవకపోవడంతో ఉపాధ్యాయులు రోజు కూలీలుగా, రోడ్డుపై కూరగాయలు, టిఫిన్లు అమ్ముకొంటూ జీవనం సాగిస్తున్నారు. నేటికీ వారి పరిస్థితి ఎటువంటి మార్పు లేకపోవడంతో తమను ఆదుకోమని ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాల ద్వారా సిఎం కేసీఆర్‌ను వేడుకొంటున్నారు. ఒకవేళ ప్రభుత్వం ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యమని చెపుతున్నారు. ఇటువంటి పరిస్థితులలో సిఎం కేసీఆర్‌ ఈ ప్రకటన చేయడం వారికి ఎంతో కొంత ఊరట కలిగించే విషయమేనని భావించవచ్చు. కానీ వారి సమస్యకు ఇది శాశ్విత పరిష్కారం కాదని అందరికీ తెలుసు. కనుక ప్రభుత్వం ఆన్‌లైన్‌ విద్యాబోధన కోసం వారిసేవలను ఉపయోగించుకోగలిగితే వారు ప్రభుత్వంపై ఆధారపడకుండా వారే సంపాదించుకొంటారు లేదా వారు ఎంచుకొన్న కొత్త వృత్తిలో స్థిరపడేందుకు అవసరమైన సహాయసహకారాలు అందజేసినా బాగుంటుంది కదా?.            


Related Post