రేపటి నుంచి తెలంగాణలో అన్ని విద్యాసంస్థలు బంద్‌

March 23, 2021
img

రాష్ట్రంలో మళ్ళీ కరోనా తీవ్రత పెరుగుతున్నందున బుదవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు మూసివేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ మేరకు నేడు శాసనసభలో ప్రకటన చేశారు. 

రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారుల సూచనలు, విద్యార్దుల తల్లితండ్రులు అభ్యర్ధనల మేరకు ఈ నిర్ణయం తీసుకొన్నట్లు మంత్రి సబితా తెలిపారు. కరోనా కారణంగా ఇప్ప‌టికే దేశంలో యూపీ, ఎంపీ, మ‌హారాష్ర్ట‌, పంజాబ్‌, త‌మిళ‌నాడు, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, గుజ‌రాత్‌ త‌దిత‌ర రాష్ర్టాలలో విద్యాసంస్థ‌లను మూసివేశారు. విద్యార్దులు, ఉపాధ్యాయులు, సిబ్బంది ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్రంలో కూడా రేపటి నుంచి మూసివేయాలని నిర్ణయించినట్లు మంత్రి సబితా తెలిపారు. విద్యాసంస్థలు మూసివేసినప్పటికీ ఎప్పటిలాగే ఆన్‌లైన్‌ క్లాసులు జరుగుతాయని తెలిపారు. వైద్య కళాశాలలు మాత్రం యధావిధిగా పనిచేస్తాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. 

కరోనా కారణంగా విద్యాసంస్థలు మూసివేయడం అనివార్యమే. కానీ దీని వలన విద్యార్దులు చదువులలో వెనుకబడిపోయే ప్రమాదం ఉంటుంది. ఇక ప్రైవేట్ స్కూళ్ళు, కాలేజీలలో పనిచేస్తున్న అధ్యాపకుల పరిస్థితి మరింత దారుణంగా మారే ప్రమాదం కనిపిస్తోంది. వారు తమ కుటుంబ పోషణకు ఉపాధ్యాయ వృత్తిని శాశ్వితంగా విడిచిపెట్టి వేరే పనులు చేసుకోక తప్పదు. కరోనా మహమ్మారి కూడా ఇప్పట్లో వదిలిపెట్టేలా లేదు కనుక అది ఎప్పటికీ సమాజంలో ఉంటుందనే భావిస్తూ తదనుగుణంగా ప్రభుత్వాలు, విద్యాసంస్థలు, పరిశ్రమలు, వ్యాపార సంస్థలు,  ఉద్యోగులు, ప్రజలు అందరూ అందుకు అనుగుణమైన ఏర్పాట్లు, జాగ్రత్తలు చేసుకోవడం మంచిది. 

Related Post