త్వరలో మెట్రో ఛార్జీలు పెంపు.. ఈసారి పక్కా!

February 13, 2025
img

త్వరలో హైదరాబాద్‌ మెట్రో టికెట్ ఛార్జీలు పెరగబోతున్నాయి. టికెట్ ఛార్జీలు పెంచాలని ఇదివరకే ఎల్ అండ్ టి సంస్థ బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కోరగా ఎన్నికలకు ముందు వద్దనుకోవడంతో పెంచలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అడగలేదు కనుక ఇంతకాలం వేచిచూసింది. ఏడాది పాలన పూర్తవడంతో మళ్ళీ టికెట్ చార్జీల పెంచుకునేందుకు అనుమతించాలని ప్రభుత్వాన్ని కోరుతోంది.

గత ఏడేళ్ళుగా మెట్రో టికెట్ ఛార్జీలు పెంచలేదు కానీ నిర్వహణ వ్యయం మాత్రం నానాటికీ పెరిగిపోతూనే ఉంది. మహాలక్ష్మీ పధకం ప్రవేశపెట్టిన తర్వాత ఆర్టీసీ బస్సులలో రద్దీ పెరిగిపోయినందున చాలా మంది మెట్రోలో ప్రయాణిస్తున్నారు. కనుక మెట్రోలో కూడా రద్దీ పెరిగి ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు.

కనుక అదనంగా మరో 10 మెట్రో రైళ్ళు కొనుగోలు చేసి నడిపించాలని ఎల్ అండ్ టి సంస్థ భావిస్తోంది. కానీ మెట్రోలో రద్దీ, నిర్వహణ వ్యయం పెరుగుతోందే తప్ప ఆదాయం మాత్రం పెరగడం లేదు. కనుక కొత్త రైళ్ళు కొనుగోలు చేసే పరిస్థితిలో లేదు. 

మెట్రో సంస్థ కొత్త ప్రతిపాదనలను సిద్దం చేసి త్వరలో ప్రభుత్వానికి సమర్పించబోతోంది. కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వం బెంగళూరు మెట్రో టికెట్ ఛార్జీలు పెంచుకునేందుకు ఇటీవలే అనుమతించింది. కనుక తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా అనుమతించే అవకాశం ఉంది.

Related Post