తెలంగాణలో అమెజాన్ పెట్టుబడి రూ.60,000 కోట్లు!

January 23, 2025
img

ఈసారి దావోస్‌ సదస్సులో తెలంగాణ రాష్ట్రానికి కనీవినీ ఎరుగని స్థాయిలో వేలకోట్లు పెట్టుబడులు వస్తున్నాయి. తాజాగా అమెజాన్ వెబ్ సర్వీసస్‌ రూ.60,000 కోట్లు పెట్టుబడితో తెలంగాణలో డాటా సెంటర్స్ ఏర్పాటు చేసేందుకు ఆ సంస్థ గ్లోబల్ పబ్లిక్ పాలసీ వైస్ ప్రెసిడెంట్ మైఖేల్ అంగీకరించారు. 

సిఎం రేవంత్ రెడ్డి బృందంతో నిన్న సమావేశమైనప్పుడు ఈ మేరకు ఒప్పందం జరిగింది. తెలంగాణలో అమెజాన్ వెబ్ సర్వీసస్‌ డాటా సెంటర్స్ ఏర్పాటుకి అవసరమైన భూమిని కేటాయించేందుకు సిఎం రేవంత్ రెడ్డి అంగీకరించారు. 

ఇదివరకు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే తెలంగాణలో అమెజాన్ వెబ్ సర్వీసస్‌ డాటా సెంటర్ ఏర్పాటుకి ఒప్పందం జరిగింది. భారీ పెట్టుబడితో హైదరాబాద్‌లో ఏర్పాటయింది కూడా. ఇప్పుడు తెలంగాణలో మరికొన్ని జిల్లాలలో కూడా డాటా సెంటర్స్ ఏర్పాటు చేయబోతోంది. 

దావోస్‌ సదస్సులో మరికొన్ని సంస్థలు కూడా తెలంగాణ డాటా సెంటర్స్ ఏర్పాటు చేసేందుకు ఒప్పందాలు చేసుకున్నాయి. కనుక రాబోయే రోజుల్లో ఈ రంగంలో తగిన విద్యార్హతలు, అనుభవం ఉన్నవారికి భారీగా ఉద్యోగావకాశాలు లభిస్తాయి. కనుక యువత ఇప్పటి నుంచే అందుకు సిద్దామవడం మంచిది. 

రూ.750 కోట్లతో ఇన్ఫోసిస్ విస్తరణ: హైదరాబాద్‌ పరిధిలో పోచారం వద్ద గల ఇన్ఫోసిస్ ఐటి క్యాంపస్ విస్తరణకు దావోస్‌ సదస్సులో నిన్న ఆ సంస్థ సీఎఫ్‌వో సంగ్రాజ్ అంగీకారం తెలిపారు. దీని ద్వారా అదనంగా మరో 17,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు.  

Related Post