సంక్రాంతి పండుగకు టిజిఎస్ ఆర్టీసీ హైదరాబాద్ నుంచి రాష్ట్రంలో జిల్లాలకు, పొరుగు రాష్ట్రాలకు కలిపి మొత్తం 6,432 ప్రత్యేక బస్సులు నడిపించబోతోంది. ఈ నెల 10,11,12 తేదీలలో ఊళ్ళకు వెళ్ళేందుకు, పండగ తర్వాత మళ్ళీ హైదరాబాద్ తిరిగి వచ్చేందుకు 19,20 తేదీలలో ఈ ప్రత్యేక బస్సులు నడిపించబోతోంది.
సంక్రాంతి పండుగ సమయంలో సిటీ బస్సులు, పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులలో ఎప్పటిలాగే మహాలక్ష్మి పధకంలో భాగంగా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు.
అయితే ఈ పధకం వలన ఆర్టీసీ భారీగా ఆదాయం కోల్పోవడమే కాక మహిళా ప్రయాణీకుల సంఖ్య పెరగడంతో ఆ మేరకు అదనపు భారం కూడా భరించాల్సి వస్తోంది. కనుక సంక్రాంతి స్పెషల్ బస్సులలో టికెట్ ధరలను రూ.1.50 చొప్పున పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో (నంబర్ 16) జారీ చేసింది. ఇతర బస్సులలో ఛార్జీలు పెంచలేదు. కనుక వాటిలో ప్రస్తుతం ఉన్న ఛార్జీలే ఉంటాయి.
ఈ స్పెషల్ బస్సులు హైదరాబాద్‌లో ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఆరాంఘర్, ఎల్బీ నగర్ క్రాస్ రోడ్స్, కేపీహెచ్‌బీ, బోయినపల్లి, గచ్చిబౌలి, తదితర ప్రాంతాల నుంచి బయలుదేరుతాయి. వీటిలో ముందుగానే టికెట్స్ బుక్ చేసుకోవచ్చు.
పూర్తి సమాచారం కొరకు టిజిఎస్ ఆర్టీసీ ఫోన్ నంబర్స్: 040-6944 0000, 040-2345 0033లకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు లేదా అధికార వెబ్ సైట్: www.tgsrtcbus.in ద్వారా తెలుసుకోవచ్చు.