గ్రీన్ ఫార్మా సిటీకి మరో 5 దిగ్గజ ఫార్మా కంపెనీలు సిద్దం

November 07, 2024
img

రంగారెడ్డి జిల్లా, కందుకూరు, యాచారం, కడ్తాల్ మండలాలో విస్తరించిన ముచ్చర్ల వద్ద రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ ఫార్మా సిటీ ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు పార్మా కంపెనీలు ఇక్కడ తమ ప్లాంట్స్ పెట్టేందుకు ముందుకు వచ్చాయి. తాజాగా తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణమైన డాక్టర్ రెడ్డీ ల్యాబ్స్, అరబిందో, హెతిరో, లారస్, ఎంఎస్ఎన్ కంపెనీలు కూడా ఇక్కడ తమ ప్లాంట్స్ పెట్టేందుకు ముందుకు వచ్చాయి. 

ఐ‌టి, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు బుధవారం సచివాలయంలో ఆ 5 కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యి చర్చించారు. ఒక్కో కంపెనీ 50 ఎకరాల విస్తీర్ణంలో ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు చేశాయని మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు చెప్పారు. ఇప్పటికే గ్రీన్ ఫార్మా సిటీని విద్యుత్, రోడ్లు, డ్రైనేజ్, నీళ్ళు వగైరా మౌలిక వసతులను కల్పిస్తూ అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. 

కొంగర్ కలాన్ నుంచి రీజినల్ రింగ్ రోడ్డు వరకు 300 అడుగుల వెడల్పుతో విశాలమైన రోడ్డు నిర్మించి, దానికి సమాంతరంగా మెట్రో కారిడార్‌ కూడా నిర్మిస్తామని దుద్దిళ్ళ శ్రీధర్ బాబు చెప్పారు.  త్వరలోనే ఈ 5 పరిశ్రమలతో ఒప్పందాలు చేసుకొని ఆ వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. ఈ 5 కంపెనీలలో కలిపి సుమారు 2 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, ఇప్పుడు అవి గ్రీన్ ఫార్మా సిటీలో కొత్తగా ఏర్పాటు చేయబోయే ఫార్మా కంపెనీలలో వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు చెప్పారు.        

ఈ 5 పరిశ్రమలతో పాటు అక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తున్న ఫార్మా కంపెనీలకు ఏడాదిలోగా అభివృద్ధి చేసిన భూములు అప్పగించి, నిర్మాణ పనులు ప్రారంభం అయ్యేలా చేస్తామని మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు చెప్పారు.

Related Post