ఉద్యోగులకు దీపావళి కానుకగా కార్లు!

October 20, 2024
img

అవును. హర్యానాలో పంచకులలో ఓ ఫార్మా కంపెనీ తమ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులకు దీపావళి కానుకగా కార్లు అందించింది. ఈ ఏడాది అత్యుత్తమ ఉద్యోగులుగా ఎంపిక చేసిన 15 మంది ఉద్యోగులకు ఆ కంపెనీ యజమాని ఎన్‌కె భాటియా టాటా పంచ్, మారుతీ గ్రాండ్ విటరా కార్లు దీపావళి కానుకగా అందజేశారు.

తమ కంపెనీ ఉద్యోగులు ఎంతో కష్టపడి పనిచేస్తూ సంస్థ అభివృద్ధికి కృషి చేస్తున్నారని, అటువంటివారికి ఈ చిరుకానుక అందిస్తున్నామని భాటియా చెప్పారు. గత ఏడాది కూడా 12 మంది అత్యుత్తమ ఉద్యోగులుగా ఎంపికైనవారికి దీపావళి కానుకగా కార్లు అందించామని చెప్పారు. కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ ఇది ప్రేరణ కలిగిస్తుందనే భావిస్తున్నామని భాటియా చెప్పారు. 

అయితే దీపావళి కానుకగా అందిస్తున్న ఈ కార్లను వారి పేర్లపై రిజిస్టర్ చేయకుండా కంపెనీ పేరిట రిజిస్టర్ చేసి ఇవ్వడం ద్వారా భాటియా కాస్త అతి తెలివి ప్రదర్శించారని చెప్పక తప్పదు.

ఆ కార్లను ఉద్యోగులు వాడుకొంటున్నప్పటికీ అవన్నీ కంపెనీ పేరు మీద ఉండటం వలన వాటి ఈఎంఐలను కంపెనీ పూర్తిగా చెల్లించి తమ పేరు మీద రిజిస్టర్ చేయించే వరకు బుద్ధిగా మరింత కష్టపడి అదే కంపెనీలోనే పనిచేయాల్సి ఉంటుంది.

కనుక యజమానికి కోపం వచ్చినా, ఉద్యోగులకు వేరే కంపెనీలో మంచి అవకాశం లభించినా ఆ కార్లు వారికి దక్కవు. కనుక ఇదో రకమైన వ్యాపా టెక్నిక్‌ అని భావించవచ్చు.

ఏది ఏమైనప్పటికీ, దీపావళి పండుగకు ముందు కొత్త కార్లు చేతికి రావడంతో వాటిని పొందిన ఉద్యోగులు, వారి కుటుంబాలు చాలా సంతోషంగా ఉన్నాయి. 


Related Post