రైళ్ళలో టికెట్స్ ముందుగా బుక్ చేసుకునేవారికి ఐఆర్‌సీటీసీ చిన్న షాక్ ఇచ్చింది. ఇప్పటి వరకు ప్రయాణానికి 120 రోజులు ముందుగా టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్ చేసుకునే అవకాశం ఉంది. నవంబర్ 1వ తేదీ నుంచి దానిని 60 రోజులకి తగ్గిస్తున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది.
60 నుంచి 120 రోజులు ముందుగా బుక్ చేసుకున్న టికెట్లలో సుమారు 21 శాతం టికెట్స్ రద్దు చేసుకుంటున్నారని, మరో 5 శాతం మంది టికెట్లు రద్దు చేసుకోవడం లేదు. ప్రయాణం కూడా చేయడం లేదని రైల్వేశాఖ తెలిపింది.
దీని వలన తప్పనిసరిగా ప్రయాణించాలనుకునేవారికి టికెట్స్ లభించకపోవడం, మరోపక్క టికెట్స్ రద్దు చేసుకోకపోవడం వలన ఆ మేరకు బెర్తులు ఖాళీ ఉండిపోతుండటం వంటివి జరుగుతున్నాయని, అందువల్లే అడ్వాన్స్ బుకింగ్ గడువుని 120 రోజుల నుంచి 60 రోజులకు కుదించాల్సి వచ్చిందని రైల్వేశాఖ తెలియజేసింది.
అయితే దీనివలన టికెట్స్ బుకింగ్ విధానం, టికెట్ ఛార్జీలు, రద్దు చేసుకున్నా టికెట్లకు రీఫండ్ విషయంలో ఎటువంటి మార్పులు ఉండవని అవన్నీ యధాప్రకారం ఉంటాయని రైల్వేశాఖ తెలియజేసింది. ఇప్పటికే 120 రోజుల ముందుగా టికెట్స్ బుక్ చేసుకున్నవారు ఆందోళన చెందనవసరంలేదని వారి బుకింగ్స్ యధాతధంగా ఉంటాయని తెలిపింది.