ట్రాఫిక్ జామ్ అయినప్పుడో, కిక్కిరిసిన బస్సులు, మెట్రోలో ప్రయాణిస్తున్నప్పుడో ఇంకా ఎంతకాలం ఈ కష్టాలు అని అనుకోకుండా ఉండలేము. ఎంతో కాలం కాదని చెపుతున్నారు సార్లా ఏవియేషన్ కంపెనీ సీఈవో అడ్రియన్ స్మిత్.
దేశంలో తొలిసారిగా బెంగళూరులో ఎయిర్ టాక్సీలు నడుపబోతున్నట్లు స్మిత్ ప్రకటించారు. దీని కోసం బెంగళూరు కెంపగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంతో ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్పారు. బెంగళూరు నగరంలో చాలా ఎక్కువ రద్దీ ఉన్న ప్రాంతాలకు తక్కువ సమయంలో సులువుగా చేరుకునేందుకు ఈ ఎయిర్ టాక్సీలు బాగా ఉపయోగపడతాయని చెప్పారు.
ఉదాహరణకు బెంగళూరులో ఒక చోటి నుంచి మరో చోటికి చేరుకోవాలంటే కనీసం గంటపైనే పడుతుంది. కానీ ఎయిర్ టాక్సీలలో కేవలం 5 నిమిషాలలో గమ్యస్థానం సురక్షితంగా చేరుకోవచ్చునని చెప్పారు.
ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టుగా బెంగళూరు నగరంలో నడిపించి రాబోయే రెండు మూడేళ్ళలో పూర్తి స్థాయి సేవలు అందిస్తామని చెప్పారు. ఈ ఎయిర్ టాక్సీలు హెలికాఫ్టర్ల కంటే వేగంగా తక్కువ ఎత్తులో, తక్కువ ఖర్చుతో ప్రయాణించవచ్చని చెప్పారు. ఈ ఎయిర్ టాక్సీ సేవలకు సంబందించి త్వరలోనే పూర్తి వివరాలు ప్రకటిస్తామని స్మిత్ చెప్పారు.