అయోధ్య రామ మందిరం ప్రారంభం అయినప్పటి నుంచి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి ప్రజలు అయోధ్యకి వెళ్ళివస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి నిత్యం వేలాదిమంది భక్తులు అయోధ్య వెళ్ళి బాలరాముడిని దర్శించుకొని వస్తున్నారు.
అయితే హైదరాబాద్ నుంచి రైల్లో అయోధ్యకి వెళ్ళి రావాలంటే చాలా సమయమే పడుతుంది. కనుక హైదరాబాద్ నుంచి నేరుగా అయోధ్య చేరుకునేందుకు నేటి నుంచి విమాన సర్వీసులు అందుబాటులోకి తెచ్చింది పౌర విమానయాన శాఖ.
నేటి నుంచి హైదరాబాద్-అయోధ్య, హైదరాబాద్-కాన్పూర్ మద్య వారానికి నాలుగు రోజులు విమాన సర్వీసులు ప్రారంభం అయ్యాయి. రేపు (శనివారం) నుంచి హైదరాబాద్-ప్రయాగరాజ్, హైదరాబాద్-ఆగ్రాల మద్య కూడా వారానికి మూడు రోజులు విమాన సర్వీసులు ప్రారంభం కాబోతున్నాయి.
ఒకేవారం హైదరాబాద్ నుంచి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో నాలుగు పర్యాటక ఆకర్షణ కేంద్రాలకు విమాన సర్వీసులు ప్రారంభించినందుకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు ఈ విమాన సౌకర్యాన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.