తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి ఏ ముహూర్తాన్న ‘హైడ్రా’ని ఏర్పాటు చేశారో కానీ ఇప్పుడు దాని పేరు ఇరుగు పొరుగు రాష్ట్రాలలోనే కాదు దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోతోంది. ఎఫ్‌టిఎల్ నిబందలను అతిక్రమించినా, బఫర్ జోన్‌లో ఉన్నా పార్టీలు, రాజకీయాలకు అతీతంగా ఆక్రమ కట్టడాలను కూల్చివేస్తోంది. వాటిలో సిఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఇంటికి కూడా నోటీసులు ఇవ్వడమే ఇందుకు చక్కటి నిదర్శనం.
కనుక హైడ్రా జోరు చూసి అక్రమ కట్టడాలు నిర్మించుకున్నవారికి కంటి మీద కునుకు లేకుండా పోతుంటే, హైడ్రా కూల్చివేతలను ఓ చక్కటి వ్యాపార అవకాశంగా గుర్తించింది ఓ కంటెయినర్ హోమ్స్ తయారీ సంస్థ.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాల్వంచ కేంద్రంగా పనిచేస్తున్న ‘సాయితేజ కంటెయినర్స్’ చాలా కాలంగా కంటెయినర్ ఇళ్ళను తయారుచేస్తోంది. వినియోగదారుల ఆర్ధిక స్థోమత, అవసరాలను బట్టి అత్యాధునిక సౌకర్యాలతో కంటెయినర్ ఇళ్ళు తయారుచేసి అందిస్తోంది.
హైడ్రా కూల్చివేతలలో వ్యాపార అవకాశాన్ని గుర్తించిన ఆ సంస్థ “హైడ్రా భయమా? మీ ఇంటిని ఎక్కడికైనా తరలించండి” అంటూ ఫేస్‌బుక్‌లో ఓ ఆసక్తికరమైన వాణిజ్య ప్రకటన ఇచ్చింది. అది చూసి అందరూ నవ్వుకుంటున్నా, చాలా అర్ధవంతంగా కూడా ఉండటంతో ఆ ప్రకటన వైరల్ అవుతోంది.