హైదరాబాద్ నుంచి ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు ప్రయాణించే రైళ్ళన్నీ నాంపల్లి, సికింద్రాబాద్, కాచిగూడ స్టేషన్ల నుంచి రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ కారణంగా ఈ మూడు స్టేషన్లలో ప్రయాణికులు, రైళ్ళ రద్దీ విపరీతంగా పెరిగిపోతోంది. ఈ సమస్యకు పరిష్కారంగా రైల్వేశాఖ హైదరాబాద్ సమీపంలోని చర్లపల్లి వద్ద మరో అతిపెద్ద రైల్వేస్టేషన్ నిర్మిస్తోంది.
రూ.434 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ రైల్వే స్టేషన్ విమానాశ్రయానికి ఏమాత్రం తీసిపోని విదంగా అత్యాధునిక హంగులతో నిర్మిస్తున్నారు. చర్లపల్లి స్టేషన్లో 9 ప్లాట్ ఫారంలు ఉంటాయి. కనుక ఇది అందుబాటులోకి వస్తే హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ స్టేషన్లపై రైళ్ళు, ప్రయాణికుల రద్దీ, ఒత్తిడి రెండూ తగ్గుతాయి.
ఇక్కడి నుంచి సాధారణ రైళ్ళతో పాటు ఎంఎంటిఎస్ రైళ్ళు కూడా నడుస్తాయి. చర్లపల్లి రైల్వే స్టేషన్ నిర్మాణ పనులు దాదాపు పూర్తవడంతో త్వరలో ప్రారంభోత్సవం చేసేందుకు దక్షిణమద్య రైల్వే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇది నాలుగవ అతిపెద్ద రైల్వే స్టేషన్. చర్లపల్లి రైల్వే స్టేషన్ ఫోటోలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సోషల్ మీడియాలో తెలంగాణ ప్రజలతో పంచుకున్నారు.