కూకట్‌పల్లి వద్ద లూలు షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి సిద్దం

September 24, 2023
img

యూఏఈకి చెందిన ప్రముఖ వ్యాపారసంస్థ లూలు గ్రూప్ అధ్వర్యంలో హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి వద్ద కొత్తగా ఏర్పాటుచేసిన భారీ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి సిద్దమైంది. రాష్ట్ర ఐ‌టి, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ ఆ సంస్థ ప్రతినిధులతో కలిసి మంగళవారం ఈ షాపింగ్ మాల్‌కు ప్రారంభోత్సవం చేయనున్నారు. 

గత ఏడాది దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్ధిక సదస్సులో మంత్రి కేటీఆర్‌ లూలు గ్రూప్‌తో దీని కోసం ఒప్పందం కుదుర్చుకొన్న సంగతి తెలిసిందే. లూలు గ్రూప్ రూ.300 కోట్ల పెట్టుబడితో 5 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణం గల ఈ షాపింగ్ మాల్‌ ఏర్పాటు చేసింది. దీనిలో 2,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు, అనేక వందల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. 

ఈ షాపింగ్ మాల్లో 5 మల్టీ ప్లెక్స్ థియేటర్లు, 200కు పైగా షాపులు, భారీ ఫుడ్ కోర్టు, వీడియో గేమింగ్ సెంటర్ వగైరా ఉంటాయి. అయితే తెలంగాణలో లూలు గ్రూప్ ప్రస్థానంలో ఇది తొలి అడుగు మాత్రమే. రాబోయే 5 ఏళ్లలో హైదరాబాద్‌లోనే మరో షాపింగ్ మాల్‌ ఏర్పాటు చేయబోతోంది. 

ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద నగరాలు, పట్టణాలలో లూలు గ్రూప్ మినీ షాపింగ్ మాల్స్ ఏర్పాటు చేయబోతోంది. వీటి కోసం లూలు గ్రూప్ రూ.3,500 కోట్లు పెట్టుబడులు పెట్టబోతోంది. వీటి ద్వారా అనేక వేలమందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు, పరోక్షంగా ఉపాధి లభించనున్నాయి. 

లూలు గ్రూప్ స్థానికంగా లభించే ఆహార ఉత్పత్తులతో పాటు వివిద ఉత్పత్తులను సేకరించి తమ షాపింగ్ మాల్స్ లో విక్రయిస్తుంటుంది. కనుక ఆయా ప్రాంతాలలో రైతులు, వివిద ఉత్పత్తులు తయారుచేసే సంస్థలకు కూడా చాలా మేలు కలుగుతుంది. 

Related Post