వచ్చే నెల దసరా, బతుకమ్మ పండుగలను పురస్కరించుకొని టిఎస్‌ఆర్టీసీ రాయితీలు ప్రకటించింది. ఈ పండుగలకు సొంత ఊర్లు వెళ్ళి వచ్చేవారికి ఈ రాయితీలు అందిస్తోంది. అక్టోబర్ 15 నుంచి 29 వరకు రానూపోనూ రెండువైపులా టికెట్స్ ఒకేసారి బుక్ చేసుకొంటే టికెట్ చార్జీలో 10 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు టిఎస్‌ఆర్టీసీ ప్రకటించింది. టికెట్స్ ఇప్పటి నుంచే అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవచ్చని, ఈ నెల 30వ తేదీలోగా బుక్ చేసుకొన్నవారికి మాత్రమే ఈ రాయితీ లభిస్తుందని తెలిపింది. ఈ రాయితీ పొందేందుకు టిఎస్‌ఆర్టీసీ రిజర్వేషన్ కౌంటర్లలో కానీ టిఎస్‌ఆర్టీసీ ఆన్‌లైన్ పోర్టల్లోగానీ టికెట్స్ బుక్ చేసుకోవచ్చునని తెలిపింది.
సాధారణంగా పండుగల సమయంలో ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థలు టికెట్ ఛార్జీలు భారీగా పెంచేసి ప్రయాణికులను దోచుకొంటుంటాయి. కానీ టిఎస్‌ఆర్టీసీ మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా టికెట్ ఛార్జీలు యధాతధంగా ఉంచడమే కాకుండా ఇటువంటి రాయితీలు ప్రకటిస్తూ ప్రయాణికులను ఆకట్టుకొని ఆదాయం పెంచుకొంటుంది. దీనికి మంచి ప్రజాస్పందన, ఆదాయం కూడా వస్తుండటంతో టిఎస్‌ఆర్టీసీ ఇదే విధానాన్ని కొనసాగిస్తూ లాభాలు ఆర్జిస్తోంది.