హైదరాబాద్‌లో టీఎస్‌ఆర్టీసీ రూట్ పాసులు... రేపటి నుంచే

May 26, 2023
img

టీఎస్‌ఆర్టీసీ హైదరాబాద్‌ నగరవాసులకు ఇప్పటికే రాయితీలతో టి-24, టీ-6, ఎఫ్‌-24 వంటి పాసులు అందుబాటులో ఉంచింది. తాజాగా నగరంలో 8 కిమీ దూరం మాత్రమే ప్రయాణించేందుకు రూట్ పాసులు అందుబాటులోకి తెస్తోంది. దీంతో నిత్యం ఒకే మార్గంలో ప్రయాణించే ఉద్యోగులు, వ్యాపారస్తులు, విద్యార్థులు ఇంకా వివిద వర్గాల ప్రజలకు ఎంతో సౌలభ్యంగా ఉంటుంది. 

ఈ రూట్ పాసుల ఖరీదు నెలకు రూ.600 కిమీగా నిర్ణయించింది. ఒకవేళ మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సులలో కూడా ప్రయాణించాలనుకొంటే నెలకు రూ.1,000లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ రూట్ పాసుతో పాటు ఐడీ కార్డు కోసం రూ.50 (ఒక్కసారి మాత్రమే) చెల్లించాల్సి ఉంటుంది. 

వీటిని శనివారం నుంచే నగర ప్రజలకు అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసి సజ్జనార్‌ తెలిపారు. నగరంలో మొత్తం 162 మార్గాలలో ఈ రూట్ పాసులను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిపారు. వీటిని ఆయా డిపోలకు అనుబందంగా పనిచేస్తున్న ఆర్టీసీ కౌంటర్లలో కొనుగోలు చేయవచ్చని తెలిపారు. వీటితో ఎంచుకొన్న 8కిమీ మార్గంలో ఆర్టీసీ బస్సులలో రోజుకి ఎన్నిసార్లయిన తిరుగవచ్చు. ఆదివారాలు, సెలవు దినాలలో కూడా వీటిని ఉపయోగించుకొని ఆర్టీసీ బస్సులలో ప్రయాణించవచ్చని వీసి సజ్జనార్‌ తెలిపారు. వీటికి సంబందించి పూర్తి వివరాల కోసం www.tsrtc.telangana.gov.in లేదా https://online.tsrtcpass.in వెబ్‌సైట్లలో చూడవచ్చని తెలిపారు. 

Related Post