తెలంగాణ మందుబాబులకు వందనాలు... రికార్డ్ సేల్స్!

May 23, 2023
img

ఈ ఏడాది వేసవి ఎండలు దంచికొట్టడంతో తెలంగాణలో మందుబాబులు క్రేట్లకు క్రేట్లు బీర్లు, మద్యం పీల్చేసి రాష్ట్ర ఖజానాని తమ కష్టార్జితంతో నింపేశారు. రాష్ట్ర అబ్కారీ శాఖ తాజా లెక్కల ప్రకారం ఈ రెండు నెలల్లో మందుబాబులు సరికొత్త రికార్డు సృష్టించారు. ఒక్క ఏప్రిల్ నెలలో రూ.2,683.65 కోట్లు విలువగల మద్యం, బీరు ఉఫ్‌మని ఊదేశారు. దానిలో 2.23 కోట్ల లీటర్లు మద్యం కాగా 3.99 కోట్ల లీటర్ల బీరు ఉన్నాయట. అంటే సగటున రోజుకి 7.43 లక్షల లీటర్ల మద్యం, 13.29 లక్షల లీటర్ల బీరు పీల్చేశారన్న మాట! 

తాము సృష్టించిన  రికార్డును తామే బద్దలు చేస్తూ ఈ నెలలో 20వ తేదీ వరకు రాష్ట్రంలో బీర్బలులు మొత్తం 3.56 కోట్ల లీటర్ల బీరు, మరో 1.37 కోట్ల లీటర్ల మద్యం పీల్చేశారు. దాని విలువ రూ.1,739.29 కోట్లు! ఈ లెక్కన సగటున రోజుకి 17.79 లక్షల లీటర్ల బీరు, 6.84 లక్షల లీటర్ల మద్యం పీల్చేస్తున్నారన్న మాట! ఇంకా మే నెల ముగిసేందుకు మరో వారం రోజులుంది. కనుక ఈ వారం రోజులలో ఇంకెంత పీల్చేస్తారో ఊహించుకోవచ్చు. 

ఈ బీర్లు, మద్యం అమ్మకాలలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అగ్రస్థానంలో ఉందని అబ్కారీశాఖ వారు మెచ్చుకొన్నారు. ఈ నెలలో ఇప్పటి వరకు 78.13 లక్షల లీటర్ల బీర్లు, 31.73 లీటర్ల మద్యం త్రాగేశారని తెలియజేసింది. దీంతో వారు రాష్ట్ర ఖజానాకు రూ.404 కోట్లు జమా చేయగా, రెండో స్థానంలో ఉమ్మడి నల్గొండ జిల్లా మందుబాబులు నిలిచారు. వీరు 40.26 లక్షల లీటర్ల బీరు, 14.58 లక్షల లీటర్ల మద్యం త్రాగేసి ఉడతాభక్తిగా రాష్ట్ర ఖజానాకు రూ.186.49 కోట్లు అందించారు. ఇక మూడో స్థానంలో వరంగల్‌, నాలుగో స్థానంలో హైదరాబాద్‌ నగరం నిలిచించిమని అబ్కారీ శాఖ తెలియజేసింది.

Related Post