తెలంగాణకు మరో అంతర్జాతీయ కంపెనీ... టెక్నిప్ ఎఫ్ఎంసీ

May 20, 2023
img

పెట్టుబడులు, పరిశ్రమల వేట కోసం అమెరికాకు వెళ్ళిన మంత్రి కేటీఆర్‌ బృందం తాజాగా మరో భారీ పెట్టుబడిని రాష్ట్రానికి సాధించింది, ఫ్రాన్స్-అమెరికన్ కంపెనీ ‘టెక్నిప్ ఎఫ్ఎంసీ’తో తెలంగాణలో రూ.1,250 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ఒప్పందం చేసుకొన్నారు. ఈ సంస్థ కూడా హైదరాబాద్‌లోనే “సాఫ్ట్‌వేర్‌ గ్లోబల్‌ డెలివరీ సెంటర్‌ అండ్‌ ప్రెసిషన్‌ ఇంజినీరింగ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ ఫెసిలిటీ” అనే ఇంజనీరింగ్ కంపెనీని ఏర్పాటు చేయబోతోంది. ఇంజనీరింగ్ పరిశ్రమలకు అవసరమైన సాఫ్ట్‌వేర్ ఉత్పత్తులను ఈ సంస్థ అందిస్తుంది. ఇప్పుడు ఎలెక్ట్రిక్ స్కూటర్లు, బస్సులు మొదలు విమానాల వరకు, ఇంకా వివిద పరిశ్రమలలో యంత్రాలు కంప్యూటర్స్ ఆధారంగా పనిచేస్తుంటాయి. ఆ యంత్రాలు లేదా వాహనాలు నిర్ధిష్టంగా పనిచేయడానికి సాఫ్ట్‌వేర్ అవసరం ఉంటుంది. దానినే టెక్నిప్ ఎఫ్ఎంసీ తయారుచేస్తుంది. 

హైదరాబాద్లో ఏర్పాటు కాబోయే ఈ ఇంజనీరింగ్ కంపెనీ ద్వారా 2,500 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు, మరో 3,500 మందికి పరోక్షంగా ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. హైదరాబాద్‌లో ఈ ప్లాంట్‌ ఏర్పాటు చేసేందుకు అంగీకరించినందుకు మంత్రి కేటీఆర్‌ టెక్నిప్ ఎఫ్ఎంసీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుకొన్నారు.  


Related Post