నేటి నుంచే హైదరాబాద్‌-విజయవాడ మద్య ఎలక్ట్రిక్ బస్సులు

May 16, 2023
img

హైదరాబాద్‌-విజయవాడ మద్య ప్రతీరోజూ ఎన్ని వందల బస్సులు తిరుగుతున్నా అన్నీ కిటకిటలాడుతూనే ఉంటాయి. ఈ మార్గంలో ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని టీఎస్‌ఆర్టీసీ ఈ-గరుడ పేరుతో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టబోతోంది. ముందుగా నేటి నుంచి 10 బస్సులను ప్రారంభించబోతునట్లు టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసి సజ్జనార్‌ తెలిపారు. ఈ ఏడాది చివరిలోగా మరో 40 ఈ-గరుడ పేరుతో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడతామని తెలియజేశారు. తెలంగాణ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ మియాపూర్ వద్ద బస్ పాయింట్ వద్ద మంగళవారం ఈ-గరుడ పేరుతో ఎలక్ట్రిక్ బస్ సర్వీసులను ప్రారంభించబోతున్నారు.

హైదరాబాద్‌-విజయవాడ మార్గంలో ప్రతీ 20 నిమిషాలకు ఒక ఈ-గరుడ ఎలక్ట్రిక్ బస్సు నడిపించేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని వీసి సజ్జనార్‌ తెలిపారు. ఈ గరుడ బస్సులో 41 సీట్లు ఉంటాయి. ప్రతీ సీటుకి మొబైల్ చార్జింగ్,రీడింగ్ ల్యాంప్ వగైరా ఉంటాయి. సాధారణ బస్సులతో పోల్చి చూస్తే ఈ-గరుడ బస్సులో ప్రయాణం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఎలక్ట్రిక్ బస్సు కావడంతో ఎంతవేగంగా ప్రయాణిస్తున్నా నిశబ్ధంగా నదిలో పూలనావలా సాగిపోతుంది. ఈ బస్సులను ఒకసారి కహర్జింగ్ చేస్తే 325కిమీ ప్రయాణించవచ్చని వీసి సజ్జనార్‌ తెలిపారు.

ఇవి కాక, రాబోయే రెండు సంవత్సరాలలో హైదరాబాద్‌లో పాత బస్సుల స్థానంలో 1,300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టబోతున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లో 10 డబుల్ డెక్కర్ బస్సులను కూడా ప్రవేశపెడుతున్నామని తెలిపారు. దూర ప్రాంతాలకు నడిపించేందుకు మరో 550 ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేస్తున్నామని తెలిపారు.

Related Post