టీఎస్‌ఆర్టీసీలో డైనమిక్ బాదుడు భరించక తప్పదట!

March 24, 2023
img

టీఎస్‌ఆర్టీసీ ఆదాయం పెంచుకొనే మార్గాల కోసం అన్వేషిస్తున్న ఆ సంస్థ ఎండీ వీసి సజ్జనార్‌ అంతర్ రాష్ట్ర బస్ సర్వీసులలో ‘డైనమిక్ ప్రైసింగ్’ విధానాన్ని అమలుచేయబోతున్నట్లు గురువారం ప్రకటించారు. ముందుగా ఈ నెల 27 నుంచి హైదరాబాద్‌-బెంగళూరు మార్గంలో ప్రయోగాత్మకం ఈ విధానాన్ని అమలుచేయబోతున్నట్లు చెప్పారు. 

దీని ప్రకారం ప్రయాణికులకు కిటికీ పక్క సీటు కావాలన్నా లేదా బస్సులో తాము కోరుకొన్న చోట, కోరుకొన్నవైపు సీట్లు కావాలన్నా అదనంగా మరో 25% చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధానంలో రద్దీని బట్టి ఛార్జీలు పెరుగుతుంటాయి. రద్దీ లేనప్పుడు 20-30% తక్కువ ధరకే టికెట్లు లభిస్తాయని వీసి సజ్జనార్‌ చెప్పారు. 

ఉదాహరణకు హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకి గరుడ బస్సు టికెట్‌ ఛార్జి రూ.1,290 కాగా రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ డైనమిక్ విధానం ప్రకారం రూ.1,550 చెల్లించాల్సి ఉంటుంది. సాధారణ రోజులలో రద్దీ లేనప్పుడు ఇదే టికెట్‌ రూ.960కి లభిస్తుంది. మిగిలిన అన్ని రకాల సర్వీసులకు కూడా ఇదే విధానం వర్తింపజేయనున్నట్లు వీసి సజ్జనార్‌ తెలిపారు.

ఐ‌టి ఉద్యోగులు శని, ఆదివారాలలో స్వస్థలాలకు వెళ్ళివస్తుంటారు. వేసవి సెలవులు, పండగ సెలవులలో ఎలాగూ విపరీతమైన రద్దీ ఉంటుంది. కనుక ఆ రోజులలో ఈ డైనమిక్ ప్రైసింగ్ విధానం అమలులో ఉంటుంది.   

ఈ ప్రయోగం విజయవంతం అయితే తర్వాత హైదరాబాద్‌- విజయవాడ, తిరుపతి, కర్నూలు, విశాఖపట్నం, ముంబై తదితర మార్గాలలో నడుస్తున్న 3,200 బస్ సర్వీసులలో కూడా అమలుచేస్తామని వీసి సజ్జనార్‌ చెప్పారు.

బస్సు బయలుదేరే గంట ముందు వరకు ఈ డైనమిక్ ప్రైసింగ్ టికెట్లు టీఎస్‌ఆర్టీసీ వెబ్‌సైట్‌ ద్వారా బుక్ చేసుకోవచ్చు. వికలాంగులు, ఆర్టీసీలో రిటైర్ అయిన ఉద్యోగులు, పాత్రికేయులకు దీని నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు వీసి సజ్జనార్‌ తెలిపారు. 

పండుగల సమయంలో మిగిలిన ప్రైవేట్ ట్రావెల్ సంస్థలు టికెట్‌ ఛార్జీలు పెంచినా టీఎస్‌ఆర్టీసీ మాత్రం పెంచకుండా సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంటోందని ఇదివరకు వీసి సజ్జనార్‌ గర్వంగా చెప్పుకొనేవారు. కానీ ఇప్పుడు ఏడాది పొడవునా డైనమిక్ బాదుడు బాదేస్తున్నారు కదా? 

Related Post