తెలంగాణ రాష్ట్రానికి రూ.750 కోట్లు పెట్టుబడులు

January 17, 2023
img

దావోస్ సదస్సులో రెండో రోజైన ఈరోజున తెలంగాణ ఐ‌టి, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ నేతృత్వంలో బృందం రాష్ట్రానికి రూ.750 కోట్ల పెట్టుబడి సాధించింది. మంత్రి కేటీఆర్‌ సమక్షంలో అలాక్స్ అడ్వాన్స్ మెటీరియల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు, తెలంగాణ ప్రభుత్వ అధికారుల బృందంతో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.  

తెలంగాణలో ఏర్పాటు చేయబోయే ఈ ప్లాంట్‌లో మల్టీగిగా వాట్ లిథియం క్యాధోడ్ బ్యాటరీ మెటీరీయల్, లిథియం ఐరన్‌ పాస్పేట్ యాక్టివ్ బ్యాటరీలు తయారుచేస్తారు. ఈ ప్లాంటులో ప్రత్యక్షంగా 600 మందికి నిపుణులకి ఉద్యోగాలు, పరోక్షంగా కొన్ని వందల మందికి ఉపాధి  అవకాశాలు లభిస్తాయి.

తొలి దశలో రూ.210 కోట్ల పెట్టుబడితో మూడు గిగావాట్స్ సామర్ధ్యం గల ప్లాంట్‌ ఏర్పాటు చేసి లిథియం ఐరన్‌ పాస్పేట్ యాక్టివ్ బ్యాటరీలు తయారుచేస్తామని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ ప్లాంట్‌పై 2030 నాటికి రూ.750 కోట్లు పెట్టుబడులు పెట్టి అంచలంచెలుగా విస్తరణ చేపడతామని తెలిపారు.

ఈ ప్లాంట్‌లో తయారయ్యే బ్యాటరీలు ఎలక్ట్రిక్ వాహనాలలో వినియోగిస్తారు. ఇప్పటికే తెలంగాణ ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీని ప్రవేశపెట్టి ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారుచేసే సంస్థలని ప్రోత్సహిస్తోంది. కనుక అలాక్స్ ఉత్పత్తి చేయబోయే బ్యాటరీలకి మార్కెట్ సిద్దంగా ఉందన్న మాట!

Related Post