హైదరాబాద్‌లో పాత బస్సుల స్థానంలో కొత్త బస్సులు త్వరలో

November 29, 2022
img

హైదరాబాద్‌ నగరంలో తిరుగుతున్న సిటీ బస్సులలో 95 శాతం పూర్తిగా పాడైపోయినవే. కానీ టీఎస్‌ఆర్టీసీ నష్టాలలో కూరుకుపోవడంతో వాటికే మరమత్తులు చేసి తిప్పుతున్నారు. ఇప్పుడు టీఎస్‌ఆర్టీసీ వాటిలో 720 బస్సులను తుక్కుగా అమ్మేసి వాటి స్థానంలో 1020 కొత్త బస్సులను ప్రవేశపెట్టబోతోంది. వీటిలో కొన్ని ఎలెక్ట్రిక్ బస్సులు కూడా ఉంటాయని టీఎస్‌ఆర్టీసీ అధికారులు తెలిపారు. మరికొన్నిటిని అంతర్ జిల్లా సర్వీసులలో లగ్జరీ, సూపర్ లగ్జరీ బస్సులుగా తిప్పుతామని తెలిపారు. డిసెంబర్‌ నెలాఖరులోగా కొత్త బస్సులు అందుబాటులోకి రావచ్చునని తెలిపారు. 

ఇక హైదరాబాద్‌ చుట్టుపక్కల జిల్లాలు, ప్రాంతాల నుంచి పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్ పాసులు కలిగిన విద్యార్థులను గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలోని పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సులలో కూడా ప్రయాణించేందుకు అనుమతించబోతున్నట్లు తెలిపారు. నగరంలో పలు ఉన్నత విద్యాలయాలు ఉండటంతో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు తమ పాసులతో నగరంలో కాలేజీలకు చేరుకోలేకపోతున్నారని తమ దృష్టికి రావడంతో ఈ నిర్ణయం తీసుకొన్నట్లు టీఎస్‌ఆర్టీసీ అధికారులు తెలిపారు.     


Related Post