మంత్రి మల్లారెడ్డి ఇళ్ళు, కార్యాలయాలపై ఐ‌టి దాడులు షురూ

November 22, 2022
img

తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఇళ్ళు, కార్యాలయాలలో ఈరోజు ఉదయం నుంచి ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆయన నివాసంతో పాటు కొంపల్లిలో నివాసం ఉంటున్న ఆయన కుమారుడు మహేందర్ రెడ్డి, అల్లుడు నివాసంలోనూ ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మల్లారెడ్డి ఎడ్యుకేషనల్ గ్రూప్‌ మహేందర్ రెడ్డి డైరెక్టరుగా ఉన్న సంగతి తెలిసిందే. మొత్తం 50 బృందాలు మల్లారెడ్డి కుటుంబ సభ్యుల ఇళ్ళు, కార్యాలయాలు, కాలేజీలలో ఈరోజు ఉదయం నుంచి సోదాలు నిర్వహించడం మొదలుపెట్టారు. 

మరోపక్క క్యాసినో వ్యవహారంలో దర్యాప్తు జరుపుతున్న ఈడీ అధికారులు మొదట మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఇద్దరు సోదరులు మహేష్ యాదవ్, ధర్మేంద్ర యాదవ్‌లను విచారించారు. నిన్న తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పీఏ హరీష్ని, షాపూర్‌కి చెందిన ఓ వ్యాపారవేత్తను సుమారు 7 గంటల పాటు ప్రశ్నించారు. 

ఇదికాక పది రోజుల క్రితం రాష్ట్రంలో గ్రానైట్ వ్యాపారస్తులపై ఈడీ బృందాలు దాడులు చేశాయి. వాటిలో మంత్రి గంగుల కమలాకర్‌కి చెందిన కంపెనీలు, ఇళ్ళు, కార్యాలయాలు కూడా ఉన్నాయి. ఇదే కేసులో టిఆర్ఎస్‌ రాజ్యసభ సభ్యుడు వడ్డిరాజు రవిచంద్ర ఇళ్ళు, కార్యాలయాలలో సోదాలు చేసింది. 

అంతకు ముందు టిఆర్ఎస్‌ ఎంపీ నామా నాగేశ్వరరావుకి చెందిన రూ.80.65 కోట్లు విలువగల స్టిరాస్తులను ఈడీ సీజ్ చేసింది. ఆయనకు చెందిన మధుకాన్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఓ జాతీయ ప్రాజెక్టు కోసం బ్యాంకు నుంచి రుణం తీసుకొని వేరే అవసరాలకు మళ్లించిందని ఈడీ ఆరోపిస్తోంది.

Related Post