రామోజీరావుకి సుప్రీంకోర్టు నోటీసు జారీ

September 20, 2022
img

ఈనాడు గ్రూప్ ఛైర్మన్ రామోజీరావుకు సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. ఆయనకు చెందిన మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థ ఆర్‌బీఐ నిబందనలకు విరుద్దంగా ప్రజల నుంచి రూ.2,600 కోట్లు డిపాజిట్లు వసూలు చేసిందని 2008లో నాంపల్లి కోర్టులో ఓ పిటిషన్‌ దాఖలైంది. దానిని కొట్టివేయాలని కోరుతూ మార్గదర్శి సంస్థ అప్పటి సమైక్య రాష్ట్ర హైకోర్టులో పిటిషన్‌ వేయగా దానిపై విచారణ జరిపిన హైకోర్టు దిగువకోర్టులో దాఖలైన పిటిషన్‌ను కొట్టేస్తూ మార్గదర్శి సంస్థకి అనుకూలంగా తీర్పు చెప్పింది. దీనిని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌ కూడా హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో కేసు వేశారు. అలాగే మార్గదర్శి సంస్థ కూడా సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసింది. 

జస్టిస్ సూర్యాకాంత్, జస్టిస్ జేబీ పార్ధీవాలాలతో కూడిన సుప్రీంకోర్టు ద్విసభ్య  ధర్మాసనం సోమవారం రామోజీరావు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రభుత్వాలకి నోటీసులు జారీ చేసింది. దానికి 4వారాలలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. 

ఈ కేసులో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరపున వాదించిన న్యాయవాది వికాస్ సింగ్, ధర్మాసనం ప్రశ్నకు జవాబు చెపుతూ, “ప్రజల నుంచి సేకరించిన వేలకోట్ల డిపాజిట్లలో తిరిగి చెల్లించిందా లేదా?ఎంత సొమ్ము సేకరించింది?ఇంకా ఎంతమందికి ఎంత చెల్లించాల్సి ఉంది?మార్గదర్శి వద్ద ఎంత సొమ్ము ఉంది? వంటి వివరాల కోసం మార్గదర్శి సంస్థలలో రికార్డులను తనికీలు చేసేందుకు వెళ్ళిన ప్రభుత్వ అధికారులకి మార్గదర్శి సంస్థ సహకరించలేదు. హిందూ అవిభాజ్య కుటుంబం పేరుతో మార్గదర్శి సంస్థ ప్రజల వద్ద నుంచి వేలకోట్ల డిపాజిట్లు సేకరించింది. ఒకవేళ హిందూ అవిభాజ్య కుటుంబం పేరుతో ఈవిదంగా చేయవచ్చునంటే మోసగాళ్ళకు అవకాశం కల్పించినట్లవుతుంది. కనుకనే ఈవిదంగా చేయడాన్ని ఆర్‌బీఐ చట్ట విరుద్దమని నిబందన విధించింది. కానీ ఆర్‌బీఐ నిబందనలకు విరుద్దంగా మార్గదర్శి సంస్థ ప్రజల నుంచి వేలకోట్లు డిపాజిట్లు వసూలు చేసింది. కనుక ఈ ఆర్ధికనేరంపై ప్రధానంగా విచారణ జరిపి నేరస్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి,” అని వాదించారు. 

Related Post