ఎనాళ్ళకెన్నాళ్ళకు... మెట్రోలో 4 లక్షల ప్రయాణికులు

September 10, 2022
img

హైదరాబాద్‌ నగరంలో మెట్రో రైల్వే స్టేషన్లు, రైళ్ళు శుక్రవారం ప్రయాణికులతో కిటకిటలాడాయి. శుక్రవారం నగరంలో గణేశ్ నిమజ్జనాలకు భారీగా జనాలు తరలివచ్చారు. శుక్రవారం రద్దీ ఎక్కువగా ఉంటుందని ముందే ఊహించిన మెట్రో అధికారులు నిన్న రాత్రి 2 గంటల వరకు సర్వీసులు నడిపించారు. దీంతో శుక్రవారం ఒక్కరోజే అన్ని మార్గాలలో కలిపి మెట్రోలో 4 లక్షల మంది ప్రయాణించారని మెట్రో అధికారులు తెలియజేశారు. 

మియాపూర్-ఎల్బీ నగర్‌లో మార్గంలో అత్యధికంగా 2.46 లక్షల మంది, నాగోల్-రాయదుర్గం మార్గంలో 1.49 లక్షల మంది, జేబీఎస్-ఎంబీఎస్ మార్గంలో 22,000 మంది ప్రయాణికులు మెట్రోలో ప్రయాణించారు. ఒక్క ఖైరతాబాద్‌ స్టేష నుంచే శుక్రవారం 22,000 మంది రైళ్ళు ఎక్కగా, 40,000 మంది అక్కడే దిగారని మెట్రో అధికారులు తెలియజేశారు. 

దీంతో మళ్ళీ రెండేళ్ళ తర్వాత అన్ని మెట్రో స్టేషన్లు, రైళ్ళు ప్రయాణికులతో కళకళలాడాయి. రాష్ట్రంలో కరోనా ప్రవేశించక మునుపు రోజుకు దాదాపు 3-3.5 లక్షల మంది ప్రయాణించేవారు. కరోనా, లాక్‌డౌన్‌ సమయంలో మెట్రో రైళ్ళు పూర్తిగా నిలిపివేయడం తీవ్రంగా నష్టపోయింది. కరోనా తీవ్రత పూర్తిగా తగ్గిన తర్వాత కూడా మళ్ళీ పుంజుకోలేదు. ప్రస్తుతం సాధారణ రోజులలో రోజుకి 3 లక్షల మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. 

మెట్రో లాభసాటిగా నడవాలంటే రోజుకి కనీసం 4-5 లక్షల మంది ప్రయాణించడం అవసరం. శుక్రవారం ఆ స్థాయిలో మెట్రోకి ప్రయాణికులు తరలివచ్చారు కనుక నిన్న ఒక్కరోజే భారీగా ఆదాయం సమకూర్చుకోగలిగింది.

Related Post