టికెట్ రద్దు చేసినా జీఎస్టీ బాదుడేనా?

August 30, 2022
img

కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విధానం అమలులోకి తెచ్చేముందు దాని గురించి ప్రజలకు చాలా తీయతీయని మాటలు చెప్పింది. అయితే దాంతో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల ఆదాయం పెరిగిన మాట వాస్తవమే కానీ ప్రజలపై పన్నుల భారం నానాటికీ పెరిగిపోతూనే ఉంది. 

ఇందుకు తాజా ఉదాహరణగా రైల్వే, విమాన, హోటల్‌ బుకింగ్ టికెట్లను రద్దు చేసుకొంటే దానిపై కూడా ప్రయాణికులు 5 శాతం జీఎస్టీ చెల్లించాలని ఆదేశించడమే. ఈ మేరకు ఆర్ధికశాఖలోని టాక్స్ రీసర్చ్ యూనిట్ ఆగస్ట్ 2న ఉత్తర్వులు జారీ చేసింది. 

ఏదైనా వస్తువు కొనుగోలు చేసినప్పుడు లేదా సేవలు పొందినప్పుడు మాత్రమే జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. కానీ టికెట్ రద్దు చేసుకొంటే ఎందుకు చెల్లించాలి?అంటే దానికి ఓ కుంటిసాకు చెప్పింది. 

“టికెట్ బుక్ చేసుకోవడం అంటే ఓ వ్యక్తి ఓ సంస్థతో ఒప్పందం చేసుకొన్నట్లే. తర్వాత దానిని రద్దు చేసుకొంటే ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లే. టికెట్ క్యాన్సిల్ చేసుకొన్నందుకు రైల్వే లేదా విమానయాన సంస్థలు క్యాన్సిలేషన్ ఛార్జీగా కొంత సొమ్మును వసూలు చేస్తాయి. అదొక పేమెంట్ (ఆర్ధిక లావాదేవీ) కనుక దానికి 5 శాతం జీఎస్టీ కట్టాలి,” అని ఆర్ధికశాఖ వివరణ ఇచ్చింది. 

కనుక టికెట్ కొన్నప్పుడూ జీఎస్టీ తప్పదు. రద్దు చేసుకొంటే మరోసారి జీఎస్టీ చెల్లించక తప్పదన్న మాట!అయితే ఇది ఇక్కడితో ఆగేది కాదు. ఒకవేళ క్యాబ్ బుక్ చేసుకొని రద్దు చేసుకొంటే దానికీ జీఎస్టీ చెల్లించాల్సి రావచ్చు. ఇలా మనం ఊహించలేని వాటన్నిటికీ కూడా దీనిని వర్తింపజేసి జీఎస్టీ వసూలు చేయడం ఖాయం. 

Related Post