యుపీఐ చెల్లింపులకు ఛార్జీలు వసూలు చేద్దామా?

August 20, 2022
img

2016, నవంబర్ 8వ తేదీన ప్రధాని నరేంద్రమోడీ దేశంలో పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించే వరకు దేశమంతటా నగదు లావాదేవీలే జరుగుతుండేవి. దాని వలన దేశంలో నకిలీ కరెన్సీ చలామణి, నల్లధనం పెరిగిపోయాయని చెపుతూ పెద్ద నోట్లు రద్దు చేసి కేంద్ర ప్రభుత్వం నగదురహిత లావాదేవీలను ప్రోత్సహించింది. ఈ విధానంలో పూర్తి పారదర్శకత ఉంటుంది కనుక అక్రమలావాదేవీలకు అడ్డుకట్టపడి, ఆదాయ, వాణిజ్య పన్నులు గణనీయంగా పెరుగుతాయని, ఇది దేశాభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుందని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. 

దేశ ప్రజలు కూడా దీనిని అర్ధం చేసుకొని మొదట్లో కాస్త ఇబ్బందిపడినా క్రమంగా నగదురహిత లావాదేవీలు చేయడం అలవాటు చేసుకొన్నారు. ఈ ఆరేళ్ళలో అనేక పేమెంట్ యాప్స్ అందుబాటులోకి రావడంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా రోజుకి 21 కోట్లకు పైగా యూపీఐ ఆధారిత పేమెంట్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు టీకొట్టులో టీ త్రాగినా, మార్కెట్లో ఏ వస్తువులు కొనుగోలు చేసినా ప్రజలు తమ మొబైల్ ఫోన్‌లలోని యూపీఐ ఆధారిత పేమెంట్ యాప్స్ ద్వారా చెల్లింపులు చేస్తున్నారు. కనుక కేంద్ర ప్రభుత్వం ఆశించినట్లు ఆర్ధికలావాదేవీలలో పూర్తి పారదర్శకత వచ్చి నగదు చలామణి చాలా వరకు తగ్గిపోయింది.   

అయితే ఇదివరకు నగదు రహిత లావాదేవీలు చేయాలని ప్రోత్సహించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు వాటికి ఛార్జీలు వసూలు చేసేందుకు సిద్దమవుతోంది. ‘చెల్లింపుల వ్యవస్థలో ఛార్జీలు’ పేరుతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ చర్చా పత్రాన్ని బ్యాంకులు, ఆర్ధిక సంస్థలు, దేశ ప్రజలు ముందు పెట్టింది. అక్టోబర్ 3లోపుగా ప్రజాభిప్రాయం తెలియజేయాలని కోరింది. ఈ విధానంలో జరిగే లావాదేవీ మొత్తంలో ఇంత శాతం అని ఛార్జీ విధించాలా లేక ప్రతీ లావాదేవీకి ఒకే రకమైన నిర్ణీత ఛార్జీ వసూలు చేయాలా?తెలియజేయాలని కోరింది. 

అంటే ఛార్జీ వసూలు చేయడానికి ముందే నిర్ణయించుకొని ఎంత వసూలు చేయాలని మాత్రమే అడుగుతోంది. కనుక త్వరలోనే ఈ బాదుడు తప్పదని భావించవచ్చు. ఇది భరించలేక ప్రజలు మళ్ళీ నగదు లావాదేవీలు జరపాలనుకొన్నా సాధ్యం కాదు. ఎందుకంటే ఇప్పుడు దేశంలో రూ.10,20,50,100 నోట్లు అందుబాటులో ఉండటం లేదు. కనుక ప్రజలు ఈ బాదుడుకి సిద్దంగా ఉండాల్సిందే. 

Related Post