సంగారెడ్డిలో ఆస్ట్రియా కంపెనీ అల్‌ప్రా ప్రారంభం

July 12, 2022
img

 ఆస్ట్రియాకు చెందిన అల్‌ప్రా కంపెనీ రూ.500కోట్లు పెట్టుబడితో సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలంలోని పాశమైలారంల్ ప్లాంట్ ఏర్పాటు చేసింది. దానిలో కొత్తగా ఏర్పాటుచేసిన మౌల్డింగ్ యూనిట్, డ్యూయల్ ఎడ్యుకేష్యన్ సెంటర్లను రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అల్‌ప్రా గ్రూప్ సీఈవో ఫిలిప్ లెహ్నర్, ఎండీ వాగేష్ దీక్షిత్, ఆస్ట్రియా రాయబారి క్యాధరినా వైజర్, టిఆర్ఎస్‌ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, జిల్లా పరిశ్రమల శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ, “ తెలంగాణ రాష్ట్రంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌తో పాటు పీస్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా ఉంది. మా ప్రభుత్వం పారిశ్రామికవేత్తలను వేధించదు. అవి ఏ రాష్ట్రం, ఏ దేశం, ఏ పార్టీకి చెందినవారివైనా సరే. కనుకనే దేశవిదేశాలకు చెందిన పలు కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు స్థాపించడానికి ముందుకు వస్తున్నాయి. వ్యవసాయ, సాగునీటి రంగాలలో తెలంగాణ రాష్ట్రం ఎంతగానో అభివృద్ధి సాధించింది. తరువాత చేపలు, రొయ్యలు, గొర్రెలు, మేకల సంఖ్య పెరిగేందుకు ప్రభుత్వం తీసుకొన్న అనేక చర్యలతో మాంసాహార ఉత్పత్తులు కూడా పెరిగాయి. హరిత విప్లవంలో భాగంగా గద్వాల, వనపర్తి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, సూర్యాపేట, నల్గొండ జిల్లాలలో 10,000 ఎకరాలలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను కూడా ఏర్పాటు చేయబోతున్నాము. రాష్ట్రంలో చెరువులు, జలాశయాలలో చేపలు, రొయ్యల పెంపకం చేపట్టిన తరువాత వాటి ఉత్పత్తి కూడా గణనీయంగా పెరిగింది. దీంతో ఇప్పుడు రాష్ట్రంలో ఆక్వా కంపెనీలు కూడా ఏర్పాటవుతున్నాయి. అమెరికాకు చెందిన ఫిష్ ఇన్ కంపెనీ మన రాష్ట్రంలో జలాశయాలలో టిలాతియా రకం చేపలను పెంచి తీసుకువెళుతోంది. 

ఆయిల్ పామ్ తోటల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నాము. రాబోయే 5 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ తోటలను పెంచాలని లక్ష్యంగా పెట్టుకొన్నాము. ప్రస్తుతం దేశంలో వంటనూనెల కొరత ఉంది. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రమే దేశానికి వంటనూనెలు సరఫరా చేసినా ఆశ్చర్యం లేదు,” అని అన్నారు. 

Related Post