హైదరాబాద్‌లో ఇంటివద్దకే పెట్రోల్, డీజిల్‌ సరఫరా

June 25, 2022
img

ఆన్‌లైన్‌ సేవలు అందుబాటులోకి వచ్చిన తరువాత ఇప్పుడు ఇంట్లో కూర్చోనే ఏ వస్తువునైనా తెప్పించుకొనే వెసులుబాటు కలుగుతోంది. పప్పులు, బియ్యం, కూరగాయలు, చేపలు, చికెన్, మాంసం మొదలు టీవీ, ఫ్రిడ్జి, ఫర్నీచర్ వంటివన్నీ ఇంటికే వచ్చేస్తున్నాయిప్పుడు. అలాగే ట్రాఫిక్‌లో పడి హోటల్‌కి వెళ్ళి గంటల తరబడి ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్‌లో బుక్ చేస్తే కోరుకొన్న హోటల్ నుంచి కోరుకొన్న ఆహారపదార్ధాలు ఇంటికే వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఆ జాబితాలోకి పెట్రోల్, డీజిల్‌ కూడా చేరిపోయాయి. 

 గోఫ్యూయెల్‌ ఇండియా అనే సంస్థ ఇప్పటికే చెన్నైలో సేవలు ప్రారంభించి విజయవంతంగా నడిపిస్తోంది. ఇప్పుడు హైదరాబాద్‌ నగరంలో కూడా తన సేవలను ప్రారంభించింది. ఆ సంస్థ కో ఫౌండర్ ఆదిత్య మీసాల, హెచ్‌పీసీఎల్‌ సీజీఎం హరిప్రసాద్‌ సింగు పల్లి, గోఫ్యూయెల్ ఫ్రాంచైజ్ సంస్థ సుష్మిత ఎంటర్‌ప్రైసస్‌ ప్రతినిధులతో కలిసి శుక్రవారం హైదరాబాద్‌లో సేవలు ప్రారంభించారు. 

దీనికోసం వినియోగదారులు ముందుగా గో ఫ్యూయెల్ మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవలసి ఉంటుంది. తరువాత దానిలో తమ వివరాలను నమోదు చేసుకొన్న తరువాత అవసరమైనప్పుడు, ఆన్‌లైన్‌లో పెట్రోల్ లేదా డీజిల్‌ బుక్ చేసుకొంటే గో ఫ్యూయెల్ వాహనం మీ ఇంటివద్దకు లేదా కార్యాలయాల వద్దకు వచ్చి పెట్రోల్ లేదా డీజిల్‌ మీ వాహనాలలో నింపుతుంది. అయితే కనీసం ఎన్ని లీటర్లు ఆర్డర్ పెట్టాలి?దానికి అదనంగా ఎంత చెల్లించాలి? నగరంలో ఏయే ప్రాంతాలలో గో ఫ్యూయెల్ సేవలు అందుబాటులో ఉంటాయనే వివరాలు ఇంకా తెలియవలసి ఉంది.

Related Post