భారత్‌లో తొలి ప్రైవేట్ రైలు ప్రారంభం

June 15, 2022
img

భారత్‌లో ఇప్పటికే ఐఆర్‌సిటిసి వేరేగా రైళ్ళను నడిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు పూర్తిగా ఓ ప్రైవేట్ సంస్థ అధ్వర్యంలో ప్రైవేట్ రైలు మంగళవారం సాయంత్రం 6 గంటలకు కోయంబత్తూరు నార్త్ స్టేషన్ నుంచి ప్రారంభం అయ్యింది. కేంద్రప్రభుత్వం ప్రవేశ పెట్టిన ‘భారత్‌ గౌరవ్’ పధకం కింద సౌత్ స్టార్ రైల్ అనే సంస్థ ఈ తొలి ప్రైవేట్ రైలు సర్వీసును నడుపుతోంది. 

‘దేకో అప్నా దేశ్’ పేరిట 5 రోజుల టూరిస్ట్ ప్యాకేజీలో కోయంబత్తూరు నుంచి మంత్రాలయం, అక్కడి నుంచి షిరిడీ చేరుకొంటుంది.  తొలి ప్రైవేట్ రైలులోనే 1,100 మంది ప్రయాణికులు టికెట్స్ బుక్ చేసుకొని బయలుదేరారు. ప్రయాణ సమయంలో రైల్వే పోలీసులతో పాటు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు, అత్యవసర చికిత్స అందించేందుకు ఓ వైద్యుడు, అగ్నిమాపక సిబ్బంది, ఒక ఏసీ మెకానిక్ కూడా అందుబాటులో ఉంటారు. ప్రయాణస్మయంలో రుచికరమైన శాఖాహార భోజనం, టిఫిన్స్ అందిస్తారు. ఏసీ బస్సు, ఏసీ వసతి, టూరిస్ట్ గైడ్, విఐపీ దర్శనాలు వగైరా ఈ ప్యాకేజీలో ఉన్నాయి. 

మంగళవారం సాయంత్రం 6 గంటలకు కోయంబత్తూరులో బయలుదేరిన ఈ ప్రైవేట్ రైలు మంత్రాలయం వద్ద 5-6 గంటలు ఆగింది. ప్రయాణికులు అందరూ అక్కడ దర్శనాలు ముగించుకొని వచ్చిన తరువాత మళ్ళీ బయలుదేరి గురువారం ఉదయం 7.25 గంటలకు షిరిడీలో సాయినగర్ రైల్వేస్టేషన్‌కు చేరుకొంటుంది. మళ్ళీ శుక్రవారం ఉదయం 7.25 గంటలకు బయలుదేరి శనివారం మధ్యాహ్నం 12 గంటలకు కోయంబత్తూరు చేరుకొంటుంది.

Related Post