తెలంగాణలో ఎలెస్ట్ రూ.24,000 కోట్ల పెట్టుబడి

June 13, 2022
img

తెలంగాణ రాష్ట్రానికి అత్యంత భారీ పెట్టుబడి వచ్చింది. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ సంస్థకు అనుబందంగా పనిచేస్తున్న ఎలెస్ట్ కంపెనీ రూ.24,000 కోట్ల పెట్టుబడి పెట్టబోతోంది. బెంగళూరులోని ఆ సంస్థ కార్యాలయంలో రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖల మంత్రి, ఆ సంస్థ డైరెక్టర్ల సమక్షంలో పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేష్ రంజన్, ఎలెస్ట్ సంస్థ అధినేత రాజేష్ మెహతా ఒప్పంద పత్రాలపై ఆదివారం సంతకాలు చేశారు.   

ఫార్ట్యూన్ 500 కంపెనీలలో ఒకటైన ఎలెస్ట్ ఈ భారీ పెట్టుబడితో దుండిగల్‌ పారిశ్రామిక పార్కులో స్మార్ట్ టీవీలు, ల్యాప్‌టాప్‌లు, టాబ్స్, మొబైల్ ఫోన్లకు అవసరమైన ఆమోలెడ్ డిస్‌ప్లే యూనిట్లను తయారుచేసే పరిశ్రమను ఏర్పాటుచేయబోతోంది. 

బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ పెట్టుబడి కోసం కర్ణాటకతో సహా దేశంలో చాలా రాష్ట్రాలు పోటీ పడ్డాయి కానీ చివరికి తెలంగాణ రాష్ట్రం దక్కించుకొంది. ఈ పరిశ్రమ కోసం తెలంగాణ ప్రభుత్వం 50 ఎకరాలు కేటాయించింది.      

ఈ సందర్భంగా రాజేష్ మెహతా మీడియాతో మాట్లాడుతూ, “దేశంలో అన్ని రాష్ట్రాలను పరిశీలించిన తరువాత తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు అత్యంత అనువైనదిగా గుర్తించాము. సరళమైన పారిశ్రామిక విధానాలు, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, నిపుణుల లభ్యత వంటి పలు అంశాలను నిశితంగా పరిశీలించిన తరువాత తెలంగాణ రాష్ట్రం అత్యంత అనువైన రాష్ట్రంగా భావించి పెట్టుబడి పెడుతున్నాము. త్వరలోనే నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభించి ఏడాదిలోగా ఉత్పత్తి ప్రారంభిస్తాము. మా ఈ సంస్థలో సుమారు 2,000 మంది సాంకేతిక నిపుణులకు, 3,000 మంది శాస్త్రవేత్తలకు ఉద్యోగాలు కల్పిస్తాము,” అని చెప్పారు.        

ఇంతవరకు తెలంగాణ రాష్ట్రంలో అమెజాన్ వెబ్ సర్వీసస్ పెట్టిన రూ.20,761 కోట్లు పెట్టుబడి అతి పెద్దది కాగా ఇప్పుడు ఎలెస్ట్ కంపెనీ అంతకంటే ఎక్కువగా రూ.24,000 కోట్లు పెట్టుబడి పెట్టబోతుండటం విశేషం. 

Related Post