టీఎస్‌ఆర్టీసీలో ఇక తరచూ బాదుడు?

May 14, 2022
img

ఓ నెలరోజుల పాటు దేశంలో పెట్రోల్, డీజిల్‌ ధరలు ఇంచుమించు ప్రతీరోజూ పెరుగుతూ ప్రజలకు మనశాంతి లేకుండా చేశాయి. దాంతో నిత్యావసర సరుకులు, బస్సులు, ఆటోల ఛార్జీలు అన్నీ పెరిగిపోయాయి. కానీ గత మూడు వారాలుగా పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరగకుండా నిలకడగా ఉండటంతో, ధరలు తగ్గకపోయినా పర్వాలేదు కానీ మళ్ళీ పెరగకుండా ఉంటే చాలని ప్రజలు అనుకొంటున్నారు. కానీ మళ్ళీ ఏదో ఓ రోజు పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరగకమానవనే సంగతి అందరికీ తెలుసు.

టీఎస్‌ఆర్టీసీ కూడా ఈవిషయం గ్రహించి డైనమిక్ విధానం అమలుచేసేందుకు సిద్దం అవుతోంది. డైనమిక్ విధానం అంటే డీజిల్ సెస్ పేరిట టికెట్ ఛార్జీకి అదనంగా వసూలు చేస్తున్న పెంచడమే. ప్రస్తుతం బస్సుల కేటగిరీ వారీగా రూ.5, రూ.10 చొప్పున వసూలు చేస్తోంది. డీజిల్ ధర పెరిగినప్పుడల్లా దానిని పెంచుతుంటుంది. అంటే ఎప్పటికప్పుడు టికెట్ ఛార్జీలు పెరుగుతుంటాయన్న మాట!

డైనమిక్ విధానం అమలుచేస్తే డీజిల్ ధరలు తగ్గినప్పుడు డీజిల్ సెస్ కూడా తగ్గించవలసి ఉంటుంది. కానీ డీజిల్ ధరలు ఎప్పుడూ పెరుగడమే కానీ తగ్గబోదు. కనుక ఈ డైనమిక్ విధానంతో టీఎస్‌ఆర్టీసీకి లాభమే తప్ప ఎటువంటి నష్టమూ ఉండదు. అందుకే త్వరలో దీనిని అమలుచేసేందుకు అధికారులు విధివిధానాలు రూపొందిస్తున్నారు. కనుక ఆర్టీసీ ప్రయాణికులు ఎప్పటికప్పుడు పెరిగే ఈ భారం మోయక తప్పదు.

Related Post