హైదరాబాద్‌ మెట్రో కష్టాలు, నష్టాలు ఈసారైనా తీరేనా?

May 09, 2022
img

కరోనా మహమ్మారి యావత్ ప్రపంచదేశాలలో అన్ని సంస్థలను, వ్యవస్థలను తీవ్రంగా దెబ్బ తీసింది. ఆ నష్టాలు, కష్టాల నుంచి నేటికీ కోలుకోలేకపోతున్నాయి. వాటిలో హైదరాబాద్‌ మెట్రో రైల్ కూడా ఒకటి. 2020లో రాష్ట్రంలో కరోనా ప్రవేశించినప్పటి నుంచి ఏడాదిపాటు మెట్రో రైళ్ళు నిలిచిపోయాయి. 

నిజానికి మెట్రో రైళ్ళు పూర్తిస్థాయిలో నడవకపోయినా నష్టాలు తప్పవు. అలాంటిది ఏకంగా ఏడాదిపాటు నిలిచిపోతే ఎంత నష్టమో ఊహించలేము. 2020-21 సంవత్సరాలలో ఆదాయం రూ.386 కోట్లు మాత్రమే రాగా రూ.1,412 కోట్లు వడ్డీలతో కలిపి నిర్వహణ వ్యయం రూ.2,120 కోట్లు అని ఎల్&టి సంస్థ తెలిపింది. దీంతో రూ.1,745 కోట్లు నష్టాలు వచ్చాయి. 

2017, నవంబర్‌లో మెట్రో రైల్‌ ప్రారంభించినప్పటి నుంచి సుమారు 7-8 ఏళ్ళలో దానిపై పెట్టిన పెట్టుబడి మొత్తం తిరిగి వస్తుందని, ఆ తరువాత నిర్వహణ ఖర్చులు పోగా లాభాలు వస్తాయని ఎల్&టి సంస్థ భావించింది. కానీ మద్యలో కరోనా మహమ్మారి విరుచుకు పడటంతో లాభాలకు బదులు నష్టాలలో మునిగిపోయింది. 

అయితే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా చక్కబడ్డాయి... మెట్రో ప్రయాణికుల సంఖ్య కూడా రోజురోజుకీ క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం నగరంలో మూడు కారిడార్‌లలో కలిపి రోజుకి సుమారు 3.5- లక్షల మంది వరకు ప్రయాణిస్తున్నారని, ఈ వేసవి చివరి నాటికి ఆ సంఖ్య 5 లక్షలు చేరుకోవచ్చునని ఎల్&టి సంస్థ  భావిస్తోంది. 

కనుక ఇక ముందు కూడా అంతా ఇదేవిదంగా సవ్యంగా సాగితే వచ్చే ఏడాది మార్చి 31నాటికి మళ్ళీ హైదరాబాద్‌ మెట్రో కోలుకొని కొంతవరకు గాడిలో పడుతుందని ఎల్&టి సంస్థ అధికారులు భావిస్తున్నారు. 

Related Post