ఇల్లు, భూమి కొనబోతున్నారా..అయితే ఆలస్యం చేయొద్దు

January 21, 2022
img

తెలంగాణలో ఇల్లు, స్థలం లేదా వ్యవసాయభూమి కొనాలనుకొంటున్నారా...అయితే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే కొనేయండి. ఎందుకంటే, ప్రభుత్వం ఫిబ్రవరి 1వ తేదీ నుంచి వ్యవసాయ, వ్యవయసాయేతర ఆస్తుల మార్కెట్‌లో విలువను పెంచబోతున్నట్లు తెలుస్తోంది. అపార్టుమెంట్ల మార్కెట్‌ విలువ 25 శాతం, నివాస స్థలాల విలువ 35 శాతం, వ్యవసాయ భూముల మార్కెట్‌ విలువను సుమారు 50 శాతం పెంచబోతున్నట్లు తాజా సమాచారం. ఇది గాక బహిరంగ మార్కెట్‌లో చాలా డిమాండ్, విలువ ఉన్న భూముల ధరలను సవరించుకొనేందుకు కూడా అవకాశం కల్పించనున్నట్లు సమాచారం. 

స్థిరాస్తుల మార్కెట్‌ విలువ పెరిగితే వాటి రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా భారీగా పెరుగుతాయి. కనుక ఇళ్ళు, స్థలాలు కొనుగోలు చేయాలనుకొంటున్నవారు వీలైతే ఫిబ్రవరి 1వ తేదీలోగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవడం మంచిది. 

తెలంగాణ ఏర్పడిన ఏడేళ్ళ తరువాత తొలిసారిగా గత ఏడాది జూలై 22 నుంచి మార్కెట్‌ విలువలను సవరించింది. ఏడాది పూర్తికాక మునుపే రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ మార్కెట్‌లో విలువలు పెంచబోతోంది. దీంతో అపార్టుమెంట్లలో ఫ్లాట్స్ ధరలు కూడా 25 శాతం పెరుగుతాయి. వాటి రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా పెరుగుతాయి. కనుక సామాన్య, మధ్యతరగతి ప్రజలకు సొంత ఇంటి కల సాకారం చేసుకోవడానికి మరింత భారం మోయక తప్పదు. కనుక ఇప్పటికే ఇళ్ళు, స్థలాలు కొనుగోలు ప్రక్రియ మొదలుపెట్టినవారు వీలైతే ఫిబ్రవరి 1వ తేదీలోగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవడం మంచిది.

Related Post