ఉప్పల్ భగత్‌లో గజం లక్ష రూపాయలు!

December 03, 2021
img

హైదరాబాద్‌ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ)కు నగరంలో భూముల వేలంపాట కాసుల వర్షం కురిపిస్తోంది. మూసీనది తీరంలో గల ఉప్పల్ భగత్ లేఅవుట్‌లో నివాస స్థలాలను గురువారం ఆన్‌లైన్‌లో వేలంవేయగా తొలిరోజునే వాటిలో రెండు ప్లాట్లు గజం ధర రూ.1.01 లక్షకు అమ్ముడుపోయాయి. వాటికి హెచ్ఎండీఏ కనీస ధరను గజం రూ.35 వేలు పెట్టగా, వేలంపాట మొదలైన కొన్ని క్షణాలలోనే వాటి ధర 50 వేలు దాటిపోయింది. నిన్న ఉదయం తొలి రౌండ్‌ వేలంపాటలో  గరిష్టంగా గజం రూ.77 వేలకు వెళ్ళగా, మధ్యాహ్నం రెండో రౌండ్‌లో రెండు ప్లాట్లు గజం రూ.1.01 లక్షకు వెళ్ళాయి. 

హైదరాబాద్‌లోని ఎంఎస్టీఎస్ కార్యాలయంలో గురువారం ఈ వేలంపాట కార్యక్రమం నిర్వహించారు. మొత్తం 44 ఫ్లాట్లలో నిన్న తొలిరోజున మొత్తం 19 వేల గజాలు విస్తీర్ణం గల 23 ఫ్లాట్లకు వేలం జరిగింది. వీటిద్వారా హెచ్ఎండీఏకు మొత్తం రూ.141.61 కోట్లు ఆదాయం వచ్చింది. ఈ లెక్కన సగటున ఒక్కో ప్లాటు ధర గజం రూ.71,815 వచ్చింది. 

నేడు మిగిలిన 1.15 లక్షల గజాల విస్తీర్ణం కలిగిన 21 ఫ్లాట్లకు వేలం నిర్వహిచబోతోంది. ఈరోజు వేలం వేయబోయే ఫ్లాట్స్ అనీ మల్టీ పర్పస్ జోన్‌లో ఉన్నందున పోటీ తీవ్రంగానే ఉండవచ్చు. నిన్నటి వేలంపాటలో పాల్గొన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ప్రవాసుల ఉత్సాహం చూసినప్పుడు, ఈరోజు వేలంపాటలో గజం ధర కనీసం రూ.70 వేలకు వెళ్ళవచ్చునని హెచ్ఎండీఏ అధికారులు భావిస్తున్నారు. 

Related Post