భారత్‌కు ఫోర్డ్ మోటార్స్ గుడ్ బై

September 25, 2021
img

గత రెండు దశాబ్ధాలుగా భారత్‌ అతి పెద్ద మార్కెట్‌ కలిగిన దేశాలలో ఒకటిగా నిలుస్తుండటంతో, అనేక అంతర్జాతీయ సంస్థలు భారత్‌లో భారీ పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు, వ్యాపారాలు ప్రారంభించాయి. అయితే భారత్‌లో నిలద్రొక్కుకోలేక వెనక్కు తిరుగుతున్న కంపెనీలు కూడా ఉన్నాయి. వాటిలో అమెరికాకు చెందిన ఫోర్డ్ మోటార్స్ కూడా ఒకటి. 

భారత్‌లో ఫోర్డ్ కంపెనీ రూ.18,500 కోట్లు పెట్టుబడితో గుజరాత్‌లో సనంద్‌లో ఒక ప్లాంట్, చెన్నైలో ఒక ప్లాంట్ పెట్టింది. ఏడాదికి 4.40 లక్షల కార్లు తయారీ సామర్ధ్యంతో వీటిని నెలకొల్పింది. వీటిలో అత్యంత ఆదరణ పొందిన ఫిగో, ఎకో స్పోర్ట్,  అస్పైర్ మోడల్ కార్లు తయారుచేస్తూ 70 దేశాలకు ఎగుమతి చేస్తోంది కూడా. ఈ రెండు ప్లాంట్లలో 4,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఫోర్డ్ కంపెనీకి 350 అవుట్ లెట్స్, 150 డీలర్లు ఉన్నారు. 

అయినప్పటికీ భారత్‌లో ఫోర్డ్ కంపెనీకి గత పదేళ్ళలో రూ.14,800 కోట్లు నష్టాలు పేరుకుపోయాయి. కనుక మహీంద్ర వంటి దేశీయ కంపెనీలతో తయారీ, అసెంబ్లింగ్, వ్యాపార ఒప్పందాలు చేసుకొనేందుకు ఫోర్డ్ గట్టిగా ప్రయత్నించింది. కానీ అవేవీ ఫలించకపోవడంతో భారత్‌లో రెండు ప్లాంట్లలో ఉత్పత్తి, అసెంబ్లీ నిలిపివేయాలని ఫోర్డ్ నిర్ణయించింది. ఇక నుంచి మ్యాచ్, ముస్టాంగ్ కూపే వంటి రెండు మూడు దిగుమతి చేసుకొన్న ఉత్పత్తులను మాత్రమే భారత్‌లో విక్రయించాలని ఫోర్డ్ నిర్ణయించింది. 

అయితే భారత్‌లో ఉత్పత్తి చేసిన మూడు మోడల్స్ కార్లకు విడిభాగాలు, సర్వీస్, వారంటీ కవరేజ్ కొనసాగిస్తామని ఫోర్డ్ ఇండియా ప్రెసిడెంట్‌ అనురాగ్‌ మెహరోత్రా  తెలిపారు. గుజరాత్‌లోని ప్లాంటును ఈ ఏడాది డిసెంబర్‌లోగా మూసివేస్తామని, చెన్నైలోని ప్లాంటును 2022 ఏప్రిల్, జూన్‌ నెలల్లో మూసివేస్తామని తెలిపారు. ఎన్నో ఆశలతో  ఫోర్డ్ కంపెనీ భారత్‌లో అడుగుపెట్టిందని కానీ దురదృష్టవశాత్తు ఆశించిన స్థాయిలో లాభాలు ఆర్జించలేకపోగా నష్టాలలో మునిగిపోతుండటంతో విధిలేని పరిస్థితులలో రెండు ప్లాంట్స్ ను మూసివేయవలసి వస్తోందని అనురాగ్‌ మెహరోత్రా  తెలిపారు.

భారత్‌ నుంచి నిష్క్రమించాలనే ఫోర్డ్ నిర్ణయంపై ఆ కంపెనీ డీలర్లు షాక్ అయ్యారు. ఎందుకంటే వారు ఫోర్డ్ కంపెనీపై నమ్మకంతో సుమారు రూ.2,000 కోట్లు పైగా పెట్టుబడిపెట్టి డీలర్‌షిప్ తీసుకొన్నారు. వారి వద్ద ప్రస్తుతం సుమారు రూ.1,000 కోట్లు విలువగల ఫోర్డ్ కార్లు అమ్మకానికి ఉన్నాయి. డీలర్లపై ఆధారపడి 40 వేలమందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. కనుక ఫోర్డ్ కంపెనీ నుంచి వారికి పూర్తి నష్టపరిహారం చెల్లింపజేయాలని ఫెడరేషన్ ఆటోమొబైల్‌ డీలర్స్‌ అసోసియేషన్స్‌ ఆఫ్‌ ఇండియా కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. 

Related Post