ఆ కంపెనీలో 500 మంది ఉద్యోగులు కోటీశ్వరులు

September 24, 2021
img

ఏ స్టార్ట్-అప్‌ కంపెనీకైనా నిలద్రొక్కుకొనే వరకు అనేక సమస్యలు, సవాళ్ళు ఎదుర్కోక తప్పదు. ఆవిదంగా నిలద్రొక్కుకోవడమే కాకుండా తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులలో 500 మందిని కోటీశ్వరులుగా మార్చింది ఫ్రెష్ వర్క్స్ అనే ఓ భారతీయ కంపెనీ. 

2010లో గిరీశ్ మాతృబూతం, పాన్ కృష్ణ స్వామి కలిసి ఫ్రెష్ డెస్క్ పేరుతో దీనిని ప్రారంభించారు. ఆ తరువాత 2017లో దీని పేరును ఫ్రెష్ వర్క్స్ గా మార్చారు. ఈ కంపెనీ వివిద కంపెనీలకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధి చేసి ఇస్తుంటుంది. దీని వ్యవస్థాపకులలో ఒకరైన గిరీశ్ మాతృబూతం ఈ కంపెనీకి సీఈఓగా వ్యవహరిస్తున్నారు. 

ఈ కంపెనీ ప్రారంభించిన కొత్తలో అందులో పనిచేసే ఉద్యోగులు కంపెనీలో వాటా (షేర్స్) కొన్నారు. ప్రస్తుతం ఉద్యోగులలో 76 శాతం మందికి కంపెనీ వాటాలు ఉన్నాయి. ఫ్రెష్ వర్క్స్ కంపెనీ శరవేగంగా వృద్ధి చెందుతుండటంతో యాక్సెల్, సిఖోయో వంటి ఇతర సంస్థలు కూడా ఫ్రెష్ వర్క్స్ షేర్స్ కొన్నాయి. 

ఫ్రెష్ వర్క్స్ కంపెనీ మొన్న బుదవారమే తొలిసారిగా నాస్‌డాక్‌లో నమోదు చేసుకొని అమెరికా మార్కెట్‌లోకి అడుగు పెట్టింది. తొలి రోజునే ఫ్రెష్ వర్క్స్ షేర్స్‌కు మంచి ఆదరణ లభించడంతో ఒకేసారి ఆ కంపెనీ షేర్ ధర 21 శాతం పెరిగింది. దీంతో భారత్‌లో ఆ కంపెనీలో షేర్స్‌ కలిగి ఉన్న 500 మంది ఉద్యోగులు రాత్రికి రాత్రి కోటీశ్వరులైపోయారు. వారిలో కొత్తగా కంపెనీలో చేరినవారు కూడా ఉండటం విశేషం. 

2019లో కంపెనీ విలువ 350 కోట్ల యుఎస్ డాలర్లు కాగా మొన్న బుదవారం నాస్‌డాక్‌లో నమోదైన తరువాత కంపెనీ విలువ 1,230 కోట్ల డాలర్లు ఉంది. దీనిని బట్టి ఫ్రెష్ వర్క్స్ కంపెనీ పనితీరు, వృద్ధి ఏవిదంగా ఉందో అంచనా వేయవచ్చు. ఒక భారతీయ కంపెనీలో 500 మంది ఉద్యోగులు కోటీశ్వరులు కావడం, అమెరికాలో ఈ ఘనత సాధించడం చాలా గొప్ప విషయమే కదా?

Related Post