ఆన్‌లైన్‌ పేమెంట్లకు కొత్త నిబంధనలు

September 24, 2021
img

ఇప్పుడు భారత్‌లో చాలా విరివిగా ఆన్‌లైన్‌లో కొనుగోళ్ళు, చెల్లింపులు చేస్తున్నారు. అలాగే ఫోన్, ఇంటర్నెట్, డీటీహెచ్, విద్యుత్, మునిసిపల్ టాక్సులు వగైరా యుటిలిటీ పేమెంట్లకు కూడా ఆన్‌లైన్‌లోనే చెల్లింపులు చేస్తున్నారు. అలాగే దీర్గకాలిక బ్యాంక్ రుణాలు, పాలసీల ప్రీమియం వగైరాలను కూడా ఆన్‌లైన్‌లోనే చెల్లిస్తున్నారు. దీర్గకాలిక పేమెంట్లకు ఆటోమెటెడ్ డెబిట్ (ప్రతీనెల నిర్ధిష్ట తేదీలలో బ్యాంక్ ఖాతా నుంచి ఆటోమేటిక్‌గా చెల్లింపులు) విధానంలో చెల్లించే వినియోగదారులు చాలామందే ఉన్నారు. ఇవన్నీ చాలా మంచి మార్పులే కానీ ఆటోమెటెడ్ డెబిట్ విధానంలో సమస్యలు ఉత్పన్నం అవుతున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గుర్తించింది. 

నిజానికి వినియోగదారుల సౌలభ్యం కోసం ఈ విధానం ఏర్పాటైంది. కానీ ఎంత పెద్ద మొత్తమైనా వినియోగదారులకు తెలియకుండానే చెల్లింపులు జరిగిపోతుండటంతో వినియోగదారులు తమ ఖాతాలో బ్యాలెన్స్ ఉందనుకొని వేరే చెల్లింపులు చేసినప్పుడు ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి సమస్యలు ఇంకా చాలానే ఉన్నాయి. 

కనుక అక్టోబర్ 1వ తేదీ నుండి రూ.5,000 కంటే ఎక్కువ మొత్తానికి ఆటోమెటెడ్ డెబిట్‌ చెల్లింపులకు తప్పనిసరిగా వినియోగదారుని అనుమతి తీసుకోవలసి ఉంటుందని ఆర్‌బీఐ ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకులను ఆదేశించింది. దీనికి సంబందించి మరికొన్ని మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. 

• ఇక నుంచి ఈ చెల్లింపులను బ్యాంకులు మాత్రమే నిర్వహించాలి. 

• రూ.5,000 కంటే ఎక్కువ మొత్తం ఆటోమెటెడ్ డెబిట్ ద్వారా చెల్లిస్తున్నప్పుడు, 24 గంటలు ముందుగా వినియోగదారునికి ఎస్‌ఎంఎస్‌ లేదా ఈమెయిల్ ద్వారా సందేశం పంపించి తెలియజేయవలసి ఉంటుంది. దీని కోసం ఓటీపీ విధానం అమలుచేయాలి. 

• బ్యాంక్ ఖాతాతో అనుసంధానం చేయబడిన మొబైల్ ఫోన్‌కు మాత్రమే ఈ సందేశాలు, ఓటీపీ పంపించవలసి ఉంటుంది. 

•  అన్ని రకాల డెబిట్, క్రెడిట్ కార్డు ఆటోమెటెడ్ డెబిట్ చెల్లింపులకు ఈ షరతులు వర్తిస్తాయి.

• ఒక్కసారి మాత్రమే (వన్స్ ఓన్లీ పేమెంట్) చేసే చెల్లింపులకు ఇది వర్తించదు.

Related Post