త్వరలో విద్యుత్, ఆర్టీసీ ఛార్జీల పెంపు?

September 22, 2021
img

సిఎం కేసీఆర్‌ అధ్యక్షతన మంగళవారం ప్రగతి భవన్‌లో టీఎస్‌ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీల పెంపుపై ఆయా శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. ఆర్టీసీ, విద్యుత్ సంస్థలు తీవ్ర నష్టాలలో కూరుకుపోతున్నాయని కనుక వీలైనంత త్వరగా ఛార్జీలు పెంచాలని వారు సిఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. 

ఈ సమావేశంలో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్‌, టీఎస్‌ఆర్టీసీ ఆర్టీసీ చెర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎండీ సజ్జనార్, ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

టీఎస్‌ఆర్టీసీ కార్మికుల సమ్మె, ఆ తరువాత వరుసగా రెండుసార్లు లాక్‌డౌన్‌, నానాటికీ పెరుగుతున్న డీజిల్, వాహనాల విడిభాగాల ధరల కారణంగా టీఎస్‌ఆర్టీసీ అష్టాల ఊబిలో కూరుకుపోతోందని, కనుక టికెట్ ఛార్జీలు పెంచక తప్పదని ఆర్టీసీ చెర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎండీ సజ్జనార్ సిఎం కేసీఆర్‌కు తెలిపారు. టీఎస్‌ఆర్టీసీ సమస్యపై సిఎం కేసీఆర్‌ స్పందిస్తూ, ఆదాయం పెంచుకొనేందుకు టీఎస్‌ఆర్టీసీ ముందున్న అన్ని మార్గాలను ఆన్వేషించాలని, వాటికి సంబందించిన ప్రతిపాదనలను సమర్పించాలని ఆదేశించారు. త్వరలో జరుగబోయే మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకొంటామని సిఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు.  

తరువాత విద్యుత్ సంస్థల పరిస్థితిపై చర్చ జరిగింది. గత ఆరేళ్ళుగా విద్యుత్ ఉత్పత్తి, నిర్వహణ ఖర్చులు నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి కానీ ఒక్కసారి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచకపోవడంతో నష్టాలు పెరిగిపోతున్నాయని ప్రభాకర్‌రావు చెప్పారు. దీనిపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకొంటామని సిఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు. 

టీఎస్‌ఆర్టీసీ భారీ నష్టాలలో మునిగిపోయింది కనుక టికెట్ ఛార్జీలు భారీగానే పెంచవచ్చు. ఆరేళ్ళ బట్టి విద్యుత్ ఛార్జీలు పెంచలేదు...ఇప్పుడు పెంచితే మళ్ళీ శాసనసభ ఎన్నికలు పూర్తయ్యేవరకు పెంచేందుకు సిఎం కేసీఆర్‌ అనుమతించకపోవచ్చు కనుక విద్యుత్ ఛార్జీలు కూడా భారీగానే పెంచవచ్చు. కనుక ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీలు పెరగడం ఖాయమే అయితే ఎప్పటి నుంచి ఎంత పెంచుతారనేది మాత్రమే తెలియవలసి ఉంది. 

Related Post